షాబాద్, జనవరి 28: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి మొదటగా చేవెళ్ల నియోజకవర్గం నుంచి సమావేశాలను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్, పరిగి పట్టణంలో నిర్వహించే సమావేశాలకు కేటీఆర్ హాజరై బీఆర్ఎస్ శ్రేణులకు ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగతా మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందింది. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నా.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీలు చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొట్టే విషయంలో పార్టీ శ్రేణులు కొంత వెనుకబడ్డాయి. తిరిగి ఆ పొరపాట్లు లోక్‌సభ ఎన్నికల్లో పునరావృత్తం కాకుండా కసరత్తు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని సన్నద్ధం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తున్నది. సోమవారం చేవెళ్ల కేజీఆర్ గార్డెన్లో ఉదయం 11 గంటలకు నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఋఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై, గులాబీ సైన్యానికి దిశానిర్దేశం చేయనున్నారు.
స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మాజీ మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు హాజరుకానున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, నవాబుపేట మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పరిగిలోని ఎస్ గార్డెన్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరుకానున్నారు. సమావేశానికి అతిథులుగా పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిలు హాజరవనున్నారు. ప్రతి మండలం నుంచి సుమారు వెయ్యి మంది వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ గ్రామ స్థాయిలోని అన్ని విభాగాల నాయకులు, బూత్ స్థాయి నాయకులు, మండల కమిటీల నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకానున్నారు.