మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అచ్చంపేట : రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించిన దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన జనగర్జన సభకు ఆయన హాజరై రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రోజుకో తీరుగా మాట్లాడుతున్నాడని, ఒకసారేమో పేదరైతు కుటుంబం అంటాడు, మరోసారి మా తాత, నాయన పోలీస్ పటేల్ అంటాడు.
ఆయన ఓ అపరిచితుడని పొద్దున రాముగా, సాయంత్రం రెమోగా మారుతున్నాడని ఎద్దేవా చేశారు. ‘గుడ్లు పీకి గోటీలాడుతా’, ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అంటూ ఆయన మాట్లాడుతున్న భాష చూస్తే అసహ్యం వేస్తున్నదన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.
ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఏం చేస్తున్నారు..
కర్ణాటకలో కృష్ణానదిపై అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచుతుంటే ఇక్కడి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఆల్మటి ప్రాజెక్టు ఎత్తును 519 మీటర్ల నుంచి ఇంకో 5 మీటర్ల ఎత్తు పెంచితే పాలమూరు జిల్లాకు చుక్కానీరు రాని పరిస్థితి వస్తుందన్నారు. పాలమూరు-రంగారెడ్డే కాదు.. తాను నిర్మించే నారాయణపేట-కొడంగల్ పథకానికి నీరు రాదని, ఒక్క మహబూబ్‌నగర్ జిల్లానే కాదు నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు కృష్ణా జలాలు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఇలాంటప్పుడు పాలమూరు పులి అని చెప్పుకొనే సీఎం గర్జించాలా వద్దా.. పిల్లిలా ఇంట్లో కూర్చోవాలా అని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం
తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వమని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాగా, రేవంత్‌రెడ్డి నల్లమల పులినా? అని కేటీఆర్ ప్రశ్నించగా.. జనం కాదుకాదు.. పిల్లి అని సమాధానం ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నల్లమల పులి కాదు నల్లమల నక్క అని కేటీఆర్ సంబోధించారు.
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చిం ఒక్క గ్యారెంటీ కూడా సాధించలేని పొంకనాల పోకిరెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆఖరికి ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లికైనా ఆరు గ్యారెంటీలు వచ్చాయా అని ప్రశ్నించారు. అచ్చంపేట నుంచే స్థానిక సంస్థల జైత్రయాత్ర కొనసాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆయన సోదరులు ఓటుకు ఐదువేలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
Rr1
దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్రలు
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఎస్ ఆనకట్టకు అన్యాయం జరుగుతుంటే పార్టీ అధినేత కేసీఆర్ ఆనాడు పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. ఈ పాదయాత్రపై అప్పటి రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే కేసీఆర్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, అతడి బ్లాక్‌మెయిల్‌కు తగ్గి ప్రభుత్వం తూములను మూస్తే బాంబులతో బద్దలు కొడతామని బెదిరించాడన్నారు.
దీనికి కేసీఆర్ స్పందిస్తూ.. బిడ్డా.. మా ఆర్డీఎస్ జోలికి వస్తే మీ సుంకేసుల బ్యారేజ్‌ను బాంబులతో పేలుస్తామని హెచ్చరించారని.. ఇది కదా గర్జించడమంటే అని గుర్తు చేశారు. అలాంటి దమ్ము, తెగువ రేవంత్‌రెడ్డికి లేవా అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్రలపై ఢిల్లీలో ఉన్న రాహుల్‌గాంధీ, ఇక్కడ ఉన్న రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. పదవి కాపాడుకునేందుకే రేవంత్ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఏ రోజుకైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. అచ్చంపేట సభకు కృష్ణానదిలా జనం తరలిరావడాన్ని చూస్తే కాంగ్రెస్‌కు అచ్చంపేట నుంచే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతున్నదన్నారు. అనంతరం నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పతనం అచ్చంపేట జనగర్జన సభ నుంచే ప్రారంభమైందన్నారు.
కేటీఆర్‌కు ఘన స్వాగతం
ఆమనగల్లు, సెప్టెంబర్ 28 : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ జనగర్జన సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావుకు ఆమనగల్లు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు నాయకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
కేటీఆర్ రాకతో హైదరాబాద్-శ్రీశైలం హైవేపై బీఆర్ఎస్ నాయకులు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అంతకుముందే బీఆర్ఎస్ శ్రేణులు జాతీయ రహదారి గుండా గులాబీ జెండాలు, బ్యాండ్ మేళాలు కేసీఆర్ పాటలతో నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని 13 గ్రామపంచాయతీల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు వాహనాల్లో కేటీఆర్ సభకు తరలివెళ్లారు. మొత్తంగా కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నిండింది.
కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్‌రావు, మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్‌గౌడ్, సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, గండికోట శంకర్, దొడ్డి పరమేశ్, రమేశ్, వెంకటేశ్, రమేశ్‌నాయక్ ఉన్నారు.