హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): తమ ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసిన గోపనపల్లి ఫ్లైఓవర్‌ను ఎందుకు ప్రారంభించడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గోపనపల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా ఆ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసిందన్నారు.
ఆ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించకుండా సర్కారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నదని ఆయన ఎక్స్‌వేదిక ద్వారా ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలపై అవగాహన లేని అసమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని విమర్శించారు. ఢిల్లీకి షటిల్ సర్వీసులు కొట్టడానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరగటానికి సీఎం రేవంత్‌రెడ్డికి సమయం ఉంది కానీ, ఆ ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు సమయం లేకుండా పోయిందని మండిపడ్డారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు ప్రజల సమస్యల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే ఆ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే ఆ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.