పరిగి/పూడూరు, అక్టోబర్ 7 : స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎంపీపీ, జడ్పీటీసీలను బీఆర్ఎస్ గెలుచుకున్నదని.. ఈసారి మళ్లీ అదే ఒరవడి పునరావృతం అవుతుందన్నారు. కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంగళవారం పరిగిలోని బృందావన్ గార్డెన్, పూడూరులోని రాకం చెర్ల ఆలయ సమీపంలో జరిగిన బీఆర్ఎస్ మండలాల పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈసారి కూడా అన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని.. ఇందుకోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశా రు. కాంగ్రెస్ పార్టీ 420 దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. ఒక్కదానిని కూడా సక్రమంగా అమలు చేయడంలేదని మండిపడ్డారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం తప్ప ప్రజలకు ఏ ఒక్క ప్రయోజనం చేకూర్చలేదన్నారు.
రోజురోజుకూ కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడంతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు వెనకడుగు వేస్తున్నదని ఆరోపించారు. రైతులకు రెండు పర్యాయాలు రైతుభరోసాను కాంగ్రెస్ ఎగ్గొట్టిందని, కేవలం ఎన్నికలప్పుడే పెట్టుబడి సాయం పైసలు వేస్తున్నదని విమర్శించారు. వరికి బోనస్ పత్తా లేదని, రైతుబీమా అమలు లేదని ఆయన దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసు లు పెట్టడం సరైంది కాదన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలంటే స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ గెలుపు ఒక్కటే పరిష్కారమని, అన్ని ఎంపీపీలు, జడ్పీటీసీలను బీఆర్ఎస్ గెలుచుకోవాలన్నారు. డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేస్తున్నదన్నారు.
ఎంపీటీసీల రిజర్వేషన్‌కు అనుగుణంగా అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందనేది ఆయా గ్రామాల నాయకులే కూర్చొని నిర్ణయించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్న వివరాలతో కూడిన బాకీ కార్డులను ఇంటింటికీ చేరవేసి కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డులను మాజీ ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు సుభాశ్చందర్రెడ్డి, రాజేందర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్, అశోక్‌వర్ధన్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శ్రవణ్‌రెడ్డి, రవికుమార్, కృష్ణ, హన్మంత్‌రెడ్డి, తాజుద్దీన్, రాంరెడ్డి, నవాజ్‌రెడ్డి, నరసింహారెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.