ఇబ్రహీంపట్నం, మార్చి 25: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా గాలికి వదిలేశారని బీఆర్ఎస్ (BRS) జిల్లా నాయకులు జంగయ్య ముదిరాజ్ అన్నారు. మండల పరిధిలోని దండమేలారం గ్రామంలో ఆయన మంగళవారం ప్రజా సమస్యలపై గ్రామంలో పర్యటించి తెలుసుకున్నారు. ముఖ్యంగా వేసవి ముంచుకొస్తున్నందున గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీటి సమస్య ఉండేది కాదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే గ్రామంలో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని వీటిని పట్టించుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతుల సమస్యలు పట్టించుకునే పార్టీ కేవలం బీఆర్ఎసేనని, కేసీఆర్ హయాంలో ప్రజలు సుభిక్షంగా జీవించారని గుర్తుచేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం అంతా కలసి పోరాడుదామన్నారు.