కాంగ్రెస్ నేతల మాటలు తమను కష్టాల్లోకి నెట్టేలా ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ విధానాలతో పాతరోజులు వచ్చి మళ్లీ ‘అన్నమో రామచంద్రా’ అంటూ వలసలు పోయే దుస్థితి వచ్చేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. 3 గంటల కరెంటు, 10 హెచ్‌పీ మోటర్లతో ఎవుసం సాగదని, నీళ్లు పారక భూములన్నీ పడావు పడుతాయని చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ రైతులకు సరిపడా సాగునీరు, పెట్టుబడి, నిరంతరం కరెంట్ అందిస్తుండడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లినవారు సైతం తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా బతుకుతున్నారు. అలాంటిది కాంగ్రెస్‌కు అధికారమిచ్చి మళ్లీ కరువు కాటకాలను తెచ్చుకోలేమని రైతులు అప్పటి భయానక పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.
రైతుల బతుకులను ఆగం చేసే కాంగ్రెస్ తమకు వద్దని, అన్నదాతల అభ్యున్నతికి పాటుపడుతున్న బీఆర్ఎస్కే తమ మద్దతంటూ పేర్కొంటున్నారు. మరోసారి సీఎం కేసీఆర్ పాలనే రావాలి.. నిరంతర కరెంట్ సరఫరా కొనసాగాలంటూ రైతులు నినదిస్తున్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 26(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఎకరాలకు ఎకరాల భూమి ఉన్న రైతులు సైతం ‘అన్నమో రామచంద్ర’ అంటూ వలసలు వెళ్లే పరిస్థితి ఉండేది. వేలాది మంది ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 3 గంటల కరెంటు, 10 హెచ్‌పీ మోటర్లతో అలాంటి భయంకర పరిస్థితులే వస్తాయని రంగారెడ్డి జిల్లా రైతాంగం ఆందోళన చెందుతున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2014లో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం లక్ష ఎకరాల లోపుగానే ఉండగా.. ఇప్పుడు నాలుగు లక్షల ఎకరాలకు వరకు పెరిగింది.
దీనివల్ల వలసలు బంద్ అయ్యాయి. రైతులంతా సొంతూళ్లకు తిరిగి వచ్చి ఆత్మగౌరవంతో సొంత పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా బతుకుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్తును అందిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తే చాలంటున్నారు.
అవసరమైతే 10 హెచ్‌పీ మోటార్లను వాడాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇదే జరిగితే జిల్లాలో రైతుల బతుకులు తలకిందులవుతాయి. కరెంటు లేక, బోర్లలో నీళ్లు లేక భూములను పడావుగా పెట్టి రైతులు వలస వెళ్లాల్సిన దుస్థితి వస్తుంది. రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లు బంద్ అవుతాయి. సకాలంలో ఎరువులు, విత్తనాలు చేతికందక వ్యవసాయం దండగ అనే పరిస్థితి దాపురిస్తుంది. కాంగ్రెస్‌కు ఓటు వేసి కోరి కష్టాలు తెచ్చుకోమని జిల్లా రైతాంగం స్పష్టం చేస్తున్నది.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం గోస తీసినం. పగలు కొన్ని గంటలు, రాత్రి కొన్ని గంటలు వచ్చేది. కరెంటు ఎప్పుడొస్తదోనని పడిగాపులు కాసేది. సీఎం కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంట్‌తో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నం. వ్యవసాయానికి మూడుగంటల కరెంట్ సరిపోతుందని మాట్లాడే రేవంత్‌రెడ్డికి వ్యవసాయం గురించి ఏం తెలుసు. గతంలో గోస పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయం. అది వచ్చేదిగాదు.. సచ్చేది కాదు.. గాల్ల మాటలు ఎందుకు నమ్ముతం. అరకొర కరెంట్‌తో మళ్లీ అవస్థలు పడే ఓపిక మాకు లేదు. బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు. కారుగుర్తుకు ఓటు వేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెడుతం.
– పెద్దగోల్ల మల్లయ్య, కుమ్మరిగూడ (షాబాద్)
మూడు గంటల కరెంట్‌తో మూడు మడులు కూడా పారవు. వ్యవసాయానికి 10 హెచ్‌పీ మోటర్లు ఎందుకు..? దానికయ్యే ఖర్చు ఎవరిస్తరు.. రేవంత్‌రెడ్డి మతి ఉండే మాట్లాడుతుండా.. బోరుబావుల్లో 500 ఫీట్ల లోతులో వాటర్ ఉంటే తప్పా 10 హెచ్‌పీ మోటర్ అవసరం. సీఎం కేసీఆర్ నీటి ప్రాజెక్టులు కట్టడం వల్ల భూగర్భ జలాలు పెరిగి ఇప్పుడు ఎక్కడ చూసినా వంద నుంచి రెండు వందల ఫీట్లలో వాటర్ పుష్కలంగా ఉన్నాయి. 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేస్తం.
అరకొర కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు కన్నీరే మిగులుతది. వ్యవసాయానికి 5 హెచ్‌పీ మోటరు బదులు 10 హెచ్‌పీ మోటరు పెట్టాలనే కాంగ్రెస్‌ను బొందపెట్టాలె. రైతులు వ్యవసాయం మానుకొని మళ్లీ వలసలు పోయే కాలం వస్తది. కాంగ్రెస్ పార్టీ ఓడించాల్సిందే. నిరంతరం కరెంట్నిచ్చే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందే. ప్రస్తుతం వ్యవసాయం పండుగలా సాగుతున్నది. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే గతంలో ఎదురైన కరెంట్ కష్టాలు మళ్లీ వస్తాయి. 3 గంటల కరెంట్‌తో పంటలు పండించలేం, కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మడానికి మేము తిక్కోలొళ్లం కాదు. మా బతుకులు బాగు చేసిన సీఎం కేసీఆర్ వెంటే రైతులందరం ఉంటం. కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటం.
– నేనావత్ దేశ్య, సాకిబండతండా (ఆమనగల్లు మున్సిపాలిటీ)
సీఎం కేసీఆర్ అందిస్తున్న ఉచిత కరెంట్‌తో మంచిగా పంటలు పండిచుకుంటున్నం. 3 గంటల కరెంట్‌తో ఎకరం పొలం కూడా తడవది. కాంగ్రెసోళ్లని నమ్మితే ఆగమైతం.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వచ్చేదో? ఎప్పుడు పోయేదో తెలవకుండే. పొలాలకు మాపేటాల వదిలే కరెంట్ కోసం కండ్లు కాసేలా ఎదురుచూసేవాళ్లం. రైతులు మంచిగా బతుకుతుంటే కాంగ్రెస్ నాయకులు ఓరుస్తలేరు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. రైతులను కంటికి రెప్పాల కాపాడుతున్న సీఎం కేసీఆర్‌కే నా మద్దతు.
– గాజుల జైపాల్‌రెడ్డి (కడ్తాల్)
కాంగ్రెస్ పాలనలో ఎన్నో చీకటి రాత్రులు చూశాం. మళ్లీ వస్తే ఆ బాధలు తప్పవు. కరెంటు ఎప్పుడొస్తదోనని రాత్రిళ్లు బావుల కాడ పడుకునేటోళ్లం. 3 గంటల కరెంట్‌తో ఎవుసం ఎండినట్టే. పొలం పారక మళ్లీ కష్టాలపాలవుతం. 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకే ఓటు వేస్తం. వ్యవసాయాన్ని చిన్నచూపు చూసే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తం. కాంగ్రెస్ మాయ మాటలను నమ్మే రోజులు పోయాయి. రైతులను రాజు చేసిన సీఎం కేసీఆర్ వెంటే ఉంటం.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలతో నిత్యం ఇబ్బందులు పేడేటోళ్లం. ఇప్పుడు 3 గంటల కరెంట్ ఇస్తామని చెబుతుండ్రు. మూడు గంటల కరెంట్‌తో ఏ మూలన్నా పారుతదా.. ? ఎవుసం గురించి తెలిసే మాట్లాడుతున్నరా..! ఇటువంటి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తం. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటే డబ్బులు ఇస్తారా..! అప్పుతెచ్చి పెట్టుకుని, మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవాలా.. రైతుల కోసం నిరంతరం ఆలోచించే బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు. కారుగుర్తుకు ఓటేసి, మళ్లీ కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా చేసుకుంటం.
– మధ్యల జంగయ్య (చేవెళ్లటౌన్)
గత ఉమ్మడి పాలనలో రైతులను ఆగం చేసిందే కాంగ్రెస్. వ్యవసాయానికి సరైన విద్యుత్ అందించకుండా, ఎరువుల కొరత ఇలా ఎన్నో సమస్యలతో రైతులు ఇబ్బందులకు గురి చేసింది. తెలంగాణ వచ్చాకే రైతుల దశ మారింది. 24గంటల విద్యుత్‌తో పాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇస్తున్నది. కాంగ్రెస్‌కు ఓటు వేయం. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం. కారుగుర్తుకు ఓటు వేసి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తం.
– రాఘవేందర్, సోలిపూర్ గ్రామం (షాద్‌నగర్‌టౌన్)
కాంగ్రెసోళ్లను నమ్మితే మళ్లీ రైతులకు కష్టాలు తప్పవు. సీఎం కేసీఆర్ 24గంటల కరెంట్ ఇస్తున్నడు. మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ మాకెందుకు.. 10 హెచ్‌పీ మోటరంటే పైసలు ఏడ తేవాలె. టెన్ హెచ్‌పీ మోటర్లు పెడితే బావుల్లోని నీళ్లు రెండు గంటల్లో ఖాళీ అవుతాయి. ఇప్పుడిప్పుడే రైతులు ఆర్థికంగా బాగుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్లు మాయమాటలతో మోసం చేస్తున్నారు. రైతులతో చెలగాటమాడుతున్నరు. వారిని నమ్మం. మళ్లా బీఆర్ఎస్నే గెలిపించుకుంటం.
– కందిమల్ల శ్రీనివాస్‌రెడ్డి జాపాల (మంచాల)
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై పెద్దగా అవగాహన లేనట్లు ఉన్నది. పూటకో మాట మాట్లాడుతున్నడు. ఒసారి మూడు గంటల కరెంట్ అంటడు. ఓసారి రైతులకు 10 హెచ్‌పీ మోటర్ అయితే బాగుంటది అంటడు. రైతుబంధు ఇస్తే మద్యం తాగుతారు అని ఆయనే అంటడు. ఇంతకు రైతులకు ఏమి చేస్తాడో చెప్పకుండా ఉట్టి గప్పాలు కొడితే ఎవ్వరు నమ్మరు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు. రైతులకు భరోసా కల్పించే బీఆర్ఎస్ విజయం ఖాయం. సీఎం కేసీఆర్ వెంటే రైతులంతా ఉన్నారు. కౌలుదారు చట్టమంటూ రైతులకు తాకులాటలు పెట్టే కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలను ఎవ్వరూ నమ్మరు.
– యాదయ్య, కొండన్నగూడ
వ్యవసాయానికి 3, 5 హెచ్‌పీ మోటర్లనే ఎక్కువగా వాడుతారు. 10 హెచ్‌పీ మోటర్లతో ట్రాన్స్ఫార్మర్లపై లోడు పడి ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయ్. లో ఓల్టేజీ సమస్యతో మోటర్లు రిపేరుకొస్తయి. మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం అవగాహన లేనోళ్లు అనే మాటలు. రేవంత్‌రెడ్డికి ఎద్దు ఎరకనా.. ఎవుసం ఎరుకనా.. ఏం మాటాడుతుండో అర్థం కాదు. ఇటువంటి పిచ్చోళ్ల చేతిలో రాష్ర్టాన్ని ఎలా పెడుతం. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతం. రైతులంతా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్‌కు జైకొడుతున్నారు. కారుగుర్తుకు ఓటు వేసి గెలిపిస్తం. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం.
– కొండ్రు మల్లేశ్, బ్రహ్మణపల్లి(తుర్కయాంజాల్ మున్సిపాలిటీ)