వికారాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : ‘మీరంతా కలిసి పనిచేస్తే వికారాబాద్ జిల్లా పరిషత్ మీద గులాబీ జెండా ఎగురుతదని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో వికారాబాద్ నియోజకవర్గం బంట్వారం, కోట్‌పల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఓట్ల కోసమే రైతు బంధు డబ్బులు వేశారనేది ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజలను జాగృతం చేయాలని, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కష్టపడి పనిచేయాలన్నారు.కాంగ్రెస్ చేసిన మోసాలను, మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తే మోసపోతారనే విషయాన్ని తెలియజేయాలన్నారు. కేసులకు ఎవరూ భయపడొద్దు, అధైర్యపడొద్దని, త్వరలో జరుగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా గెలిస్తే కేసులు పెట్టే అధికారులంతా మీ వద్దకు వస్తారని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికలను ఆషామాషీగా తీసుకొవద్దని, పార్టీ నుంచి పూర్తి ప్రోత్సాహం ఉంటుందని, అందరినీ కలుపుకొని పోయి సమష్టిగా పనిచేస్తే మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. ఆశావహుల పేర్లను తీసుకొని, ఎవరికి పేరుంటే, అందరికీ ఆమోదయోగ్యమైన వారిని బరిలో దింపాలన్నారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి, జడ్పీటీసీ స్థానానికి ఒక ఇన్చార్జిని నియమించి, పక్కా ప్రణాళికతో పనిచేసి మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. 30 ఏండ్ల కల వికారాబాద్ జిల్లా కలను కేసీఆర్ తీర్చారు, వికారాబాద్‌కు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీని మంజూరు చేశారని, కానీ మనం ప్రచారం చేసుకోలేకపోయామని ఆయన వివరించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగేందర్‌గౌడ్, శుభప్రద్‌పటేల్, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
హంగామా వద్దు.. ప్రజలకు మేలు చేసే పనులు చేయండి
– మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం పనులేమీ చేయకుండా హంగామా చేస్తున్నదని, ప్రచారానికి ప్రాధాన్యతనివ్వకుండా ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. రైతులకు శాశ్వత పరిష్కారం చూపేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. ఒక విజన్‌తో కేసీఆర్ పనిచేశారు కాబట్టి రైతు బంధు, కల్యాణలక్ష్మి, భగీరథ నీళ్లు తాగితే కేసీఆర్ గుర్తుకు వస్తున్నారన్నారు. రాష్ర్టాన్ని ఓ కుటుంబంలా అనుకొని, కుటుంబ పెద్దగా కేసీఆర్ పనిచేశారన్నారు. అదేవిధంగా కార్యకర్తలు తలెత్తుకొని కాలర్ ఎగిరేసేలా బీఆర్ఎస్ పార్టీ చేసిందన్నారు. త్వరలో జరుగనున్న ప్రీ ఫైనల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
త్వరలో కాంగ్రెస్ ఖాళీ…
– బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
త్వరలో వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లోకి చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు, ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలకు స్వాగతం చెప్తున్నామన్నారు.