వికారాబాద్, ఆగస్టు 20 : యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కావాల్సినన్ని ఎరువులు సరఫరా చేయటం జరిగిందని గుర్తు చేశారు. మార్పు పేరుతో ప్రజలను మభ్యపెట్టి, చేతగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ చెప్పుకుని తిరుగుతూ ప్రజలను, వారి కష్టాలను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇలా రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడినా కూడా యూరియా దొరకక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా.. ‘మీ కాళ్లు మొక్కుతా సారూ.. మాకు యూరియా కావాలె’ అంటూ.. అటు పోలీసులు ఇటు పీఏసీఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతున్న రైతుల పరిస్థితి చూస్తూ ప్రభుత్వ వైఫల్యం అర్థమవుతుందన్నారు. దీనిపై ఏమాత్రం స్పందించకుండా బాధ్యతలు గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఈ వైఫల్యాన్ని కేంద్రం ఖాతాలో వేసి, తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. రైతుల పట్ల నిర్లక్ష్యం మాని ఇప్పటికైనా సరిపడా యూరియా అందించాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.