రంగారెడ్డి, ఏప్రిల్ 13 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలతో రజతోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో రజోత్సతవ సభకు జనసమీకరణ జరిపే విషయమై నియోజకవర్గస్థాయి సమావేశాలు పూర్తయ్యాయి. ఇప్పటికే మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశం కూడా నిర్వహించారు. రెండో విడుతలో నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు కూడా పూర్తయ్యాయి. అలాగే, రేపటి నుంచి నియోజకవర్గాల వారిగా సమన్వయకమిటీ సమావేశాలతో పాటు మండలం, మున్సిపాలిటీల అధ్యక్ష, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యంగా రంగారెడ్డిజిల్లాలోని 16 మున్సిపాలిటీలు, 2 నగరపాలక సంస్థలు, 21 మండలాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లా నుంచి 317 ఆర్టీసీ బస్సులు, 20 ప్రైవేటు బస్సులు జనసమీకరణకు ఉపయోగించనున్నారు. అలాగే, సుమారు 700కార్లల్లో బహిరంగ సభకు వెల్లే విధంగా ప్లాన్ సిద్దం చేశారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి 75 ఆర్టీసీ బస్సులు, 20ప్రైవేటు బస్సులు, 160కార్లు, ఎల్బినగర్ నియోజకవర్గం నుంచి 72బస్సులు, 220కార్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి 55 ఆర్టీసీ బస్సులు, 100కార్లు, మహేశ్వరం నియోజకవర్గం నుంచి 83బస్సులు, 100కార్లు, చేవెళ్ల నియోజకవర్గం నుంచి 62బస్సులు, 100కార్ల ద్వారా బహిరంగసభకు వెల్లే విధంగా సిద్దం చేశారు. ముఖ్యంగా జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల నుంచి పెద్ద ఎత్తున బహిరంగసభకు జనసమీకరణ చేపట్టాలని పార్టీ భావిస్తోంది.
హైదరాబాద్ శివార్లలోని ఎల్బినగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలివస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే కార్యకర్తల సమావేశాలు కూడా పూర్తిచేసి బహిరంగసభకు హాజరుకావల్సిన ఆవశ్యకతపై పార్టీకి దిశానిర్దేశం చేశారు. జిల్లా అద్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఈ ఐదు నియోజకవర్గాల నుంచి జనసమీకరణ, కార్యకర్తలను, ప్రజలను బహిరంగసభకు తరలించి వారిని సురక్షితంగా చేర్చే బాద్యతను మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి అధిష్టానం అప్పగించింది. 27న జరుగనున్న రజతోత్సవ సభకు జిల్లానుంచి భారీ ఎత్తున జనసమీకరణ జరిపి.. జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ భావిస్తోంది.
సన్నాహక సమావేశాలతో క్యాడర్లో జోష్..
బీఆర్ఎస్పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తుండటంతో గులాబి దళంలో కొత్త జోష్ నింపినట్లవుతోంది. ఇప్పటికే చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల సమావేశాలు జరిపి పార్టీలో నూతన్నోత్తేజం తీసుకురావాలని అదిష్టానం భావిస్తోంది. జిల్లాలోని ప్రతి కార్యకర్తను కదిలించే విధంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖ మొదలైంది : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేఖత మొదలైంది. ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చకపోగా.. అన్ని వర్గాల ప్రజలను అసంతృప్తికి గురిచేసిందని జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావసభ అనంతరం రాష్ట్రంలో బీఆర్ఎస్ సత్తా చాటుతోందని అన్నారు. బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగసభకు గ్రామాల నుంచి స్వచ్చందంగా తరలివచ్చేందుకు సిద్దమవుతున్నారని, ఇప్పటికే బహిరంగసభకు తరలివచ్చేందుకు ఆయా గ్రామాల్లో కార్లు, ఇతర వాహనాలను స్వచ్చందంగా నాయకులు, కార్యకర్తలే సిద్దం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలోని గ్రామగ్రామం నుంచి ప్రజలు, కార్యకర్తలు, బీఆర్ఎస్ బహిరంగసభకు హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ, ఇతర ప్రైవేటు బస్సులతో పాటు ప్రైవేటు కార్లను కూడా ప్రజలను కార్యకర్తలు తరలించేందుకు వినియోగిస్తున్నామని అన్నారు. బహిరంగసభ జిల్లాలో బీఆర్ఎస్పార్టీ మరోమారు తన సత్తా చాటుతోందని ఆయన అన్నారు.