పరిగి, ఫిబ్రవరి 14 : పరిగి మున్సిపాలిటీలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా మాజిక్ ఫిగర్‌ను మాత్రం దాటలేదు. పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులున్నాయి. 8 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, మరో 8 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, రెండు వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఆ ఇద్దరు ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ రెబెల్స్ కావడం గమనార్హం.
మాజిక్ ఫిగర్ దాటకపోవడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు సర్కార్ పోలీసులను అడ్డం పెట్టుకొని మరీ స్వతంత్ర అభ్యర్థిని తీసుకెళ్లిందనే విమర్శలున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున బేరసారాలకు దిగినట్లు ప్రచారమూ జరు గుతున్నది. మున్సిపల్ నామినేషన్ల సందర్భంగా పరిగిలో 18 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని స్థానిక ఎమ్మెల్యే శపథం చేయగా చివరకు ఒక్క సీటు కోసం స్వతంత్ర అభ్యర్థిపై ఆధారపడాల్సిన స్థితి వారికి ఏర్పడింది.
పరిగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. హస్తం పార్టీతో సమానంగా కౌన్సిలర్ స్థానాలు సాధించి శెభాష్ అనిపించుకున్నది. బీఆర్ఎస్కు చెందిన వారు ఎనిమిది మంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. కాగా కేవలం 20 ఓట్ల లోపు తేడాతో మరో రెండు సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది. మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ 8 ఓట్ల తేడాతో, 17వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ 18 ఓట్ల తేడాతో ఓటమి పాలవడం గమనార్హం.
దీంతోపాటు బీజేపీ ఎక్కువగా ఓట్లు చీల్చిన వార్డుల్లో బీఆర్ఎస్కు నష్టం జరిగి కాంగ్రెస్‌కు మేలు చేకూరింది. ఎనిమిదో వార్డులో బీజేపీ అభ్యర్థికి 150 ఓట్లు, 16వ వార్డులో బీజేపీ అభ్యర్థికి 420 ఓట్లు, 17వ వార్డులో బీజేపీ అభ్యర్థికి 341 ఓట్లు వచ్చాయి. ఈ మూడు వార్డుల్లో బీజేపీకి వెళ్లిన ఓట్లలో అత్యధికంగా బీఆర్ఎస్కు వచ్చే ఓట్లు ఉండడం గమనార్హం. బీఆర్ఎస్కు రావాల్సిన ఓట్లు బీజేపీకి వెళ్లడంతో ఈ మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 8, 17 వార్డుల్లో అతిస్వల్ప తేడాతోనే బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఏదిఏమైనా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటింది.