షాద్‌నగర్/కొడంగల్/కడ్తాల్/కొత్తూరు, జూన్ 2 : ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీ ఆశ్చర్యపోయే రీతిలో ఓటర్లు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా పాలమూరులో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి బంపర్ మెజార్టీతో గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొన్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వం పై ఉన్న నమ్మకం..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపులో ప్రధాన భూమికను పోషించారు.
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. మార్చి 28న జరిగిన పోలింగ్‌లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎంపీ ఎన్నికల అనంతరం ఫలితాలను ప్రకటించాలని ఎన్నికల కమిషన్ సూచించడంతో ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి ఫలితాలను వెల్లడించారు. 1437 ఓట్లకుగాను ఆరు రౌండ్లలో ఫలితాలను ప్రకటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మొదటి రౌండ్ నుంచే బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి ఆధికత్యను ప్రదర్శించి.. 109 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు.
మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితాలు తేలడంతో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించలేదు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి 653 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డికి 762, స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోలైన 1437 ఓట్లలో 21 ఓట్లు చెల్లలేదు.

గెలుపు కోసం అధికార పార్టీ నాయకులు తీవ్రంగా కృషిచేసినా బీఆర్ఎస్పై ఉన్న నమ్మకంతో ఆ పార్టీ అభ్యర్థికే ఓటర్లు మొగ్గుచూపారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగలడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. నవీన్‌కుమార్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డికి షాద్‌నగర్ పట్టణంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
పట్టణ ముఖ్యకూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కొత్తూరు చౌరస్తాలో ఉన్న మహాత్మా ఫూలే విగ్రహానికి కూడా ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం పట్ల నవీన్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మె ల్యే నవీన్‌కుమార్‌రెడ్డికి జిల్లా బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాదారం నర్సింహాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, గోపాల్‌గౌడ్, బ్యాగరి యాదయ్య, శివచారి, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా కొడంగల్ సెగ్మెంట్లోని దౌల్తాబాద్ మండలంలో జడ్పీటీసీ కోట్ల మహిపాల్, బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. స్థానిక సం స్థల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులున్నా ఓటర్లు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపా రు. పైగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయన ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా స్థానిక సంస్థల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎదురుదెబ్బ పాలమూరు నుంచి తగిలిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలనావైఫల్యానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమి ఓ ఉదాహరణగా పేర్కొంటున్నారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో ఆదివారం మండలంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకు లు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. జడ్పీటీసీ దశరథ్‌నాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో పటాకులుకాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెం కటేశ్గుప్తా, ఎంపీటీసీలు గోపాల్, లచ్చి రాంనాయక్, మంజుల, ప్రియ, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, మాజీ సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్, తులసీరాంనాయక్, భూనాథ్నాయక్, కృష్ణయ్యయాదవ్, భారతమ్మ, నాయకులు నర్సింహాగౌడ్, చంద్రమౌళి, రమేశ్‌నాయక్, లాయక్‌అలీ, రామచంద్రయ్య, నర్సింహా, యాదయ్య, పవన్, మల్లేశ్, రమేశ్, జమీర్, సురేశ్, శ్రీను, పాండు, వెంకటేశ్, అంజి, సాబేర్, శ్రీకాంత్, లక్ష్మణ్, మహేశ్, ఇర్షాద్, నరేశ్, గణేశ్, రాజు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.