ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 19 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జాజోనిబావి, మాన్యగూడ, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, రాయపోల్, ముకునూరు, దండుమైలారం, నెర్రపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో గ్రామాల్లో అభివృద్ధి జరుగలేదన్నారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు.
ఇబ్రహీంపట్నం నుంచి రాయపోల్, ముకునూరు, దండుమైలారం గ్రామాల మీదుగా తూప్రాన్‌పేట విజయవాడ హైవేవరకు రోడ్డును విస్తరించటంతో పాటు నాగన్‌పల్లి, పోల్కంపల్లి గ్రామాల మీదుగా అనాజ్‌పూర్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా స్వచ్ఛతకు మారుపేరుగా గ్రామాలు, పట్టణాలు నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ధరణిపోర్టల్ తీసేస్తామని, 3గంటల ఉచిత కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓటుతోనే బుద్ది చెప్పాలన్నారు.
యువతీయువకులకు కొంగరకలాన్ సమీపంలో నిర్మాణ పనులు కొనసాగుతున్న ఫాక్స్‌కాన్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించేందుకు తానే బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇప్పించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, వైస్‌ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు రవణమోని మల్లీశ్వరి జంగయ్య, చెరుకూరి ఆండాలు యాదగిరి, జ్యోతి రాజు, బల్వంత్‌రెడ్డి, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, జ్యోతి, చెరుకూరి మంగ రవీందర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలుగౌడ్, దానయ్యగౌడ్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.