కడ్తాల్, జూలై 13 : విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కడ్తాల్‌లో కేజీబీవీ నూతన భవన నిర్మాణం పూర్తయినా ప్రారంభించకుండా తీవ్ర జాప్యం చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆ భవనం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆమరణ దీక్ష చేయడానికి వెళ్లారు. కాగా, దీక్షకు అనుమతిలేదని పోలీసులు అడ్డుకోగా నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కేజీబీవీకి సొంత భవనం లేకపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యి నెలలు గడుస్తున్నా ప్రారంభించడం లేదన్నారు. విద్యా సంవత్సరం పూర్తికావడంతో తప్పని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఇక్కడి విద్యార్థినులను కందుకూరు, ఆమనగల్లు కేజీబీవీల్లో చేర్పించారన్నారు. అయితే బీఆర్ఎస్ ఆందోళన విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ నెల 17న భవనాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారని, ఒకవేళ ఆ రోజు భవనాన్ని ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ సువాళీపంతూనాయక్, మాజీ సర్పంచ్‌లు యాదయ్య, సులోచనాసాయిలు, పూజాదేవానాయక్, మాజీ ఎంపీటీసీలు గోపాల్, ప్రియారమేశ్నాయక్, నాయకులు నర్సింహ, లాయక్‌అలీ, రమణ, వెంకటేశ్, సురేశ్, లింగం, కోట్యా, శ్రీను, పాండు, రమేశ్, మహేశ్, కిషన్, గణేశ్, రాజు, అంజి, తిరుపతి, బాబా, దాస్య, శ్రీకాంత్, చందు, యాదగిరి, రామకృష్ణ, చెన్నయ్య, రతన్, జగన్, మోబీన్, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ భవనాన్ని ఈ నెల 17న ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో వారు స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కేజీబీవీ భవనాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, కృష్ణారావు, ఎంపీ మల్లు రవి హాజరవుతారన్నారు.