కొండాపూర్, జనవరి 9 : శంకుస్థాపన కోసం శిలా ఫలకం వేసి సంవత్సర కాలం గడిచిన, నేటికి పనులు ప్రారంభం కాకపోవడంతో వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. బీఆర్ఎస్(BRS) మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం చందా నగర్ డివిజన్ శుభోదయ కాలనీలో సంవత్సరం క్రితం ఏర్పాటు చేసిన శిల ఫలకానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, కేక్ కోసి శంకుస్థాపనలు చేసిన ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నవతారెడ్డి మాట్లాడుతూ..స్థానిక ఎమ్మెల్యే ఉత్తిత్తి శంకుస్థాపనలు మానుకోవాలని, ఇది వరకే చేసిన వాటిన వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఓట్ల కోసం ప్రజలను మోసం చేసేలా హడావిడి శంకుస్థాపనలను ప్రజలు నమ్మరన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారే నాయకులు, కేవలం ఫొటోల కోసమే శంకుస్థాపనలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో శుభోదయ కాలనీలో ఒక్క రూపాయి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం సిగ్గు చేటన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు కాలని ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాలని వాసులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.