యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ‘క్యామ మల్లేశ్ బడుగు బలహీన వర్గాల వ్యక్తి. మంచి మనిషి.. పట్టుదల, నిజాయితీ ఉన్న వ్యక్తి. గెలిస్తే 24గంటలు పనిచేసే నాయకుడు. అభివృద్ధి చేస్తారు. ఆస్తిపాస్తులు ఉన్నోడు. డబ్బుల కోసం పాకులాడేటోడు కాదు. చదువుకున్న విద్యావంతుడు. తలలో నాలుకలా ఉండే వ్యక్తి. మల్లేశ్‌ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. భువనగిరి పట్టణంలో గురువారం నిర్వహించిన రోడ్‌షోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని, మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పారు. భువనగిరి చూపిస్తున్న ఉత్సాహాన్ని ఏడు నియోజకవర్గాల్లో చూపించాలని కోరారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలన్నారు.
గురుకులాల్లో అన్నం తిని వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని, భువనగిరిలో ఓ అబ్బాయి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సంక్షేమ కోసం తెచ్చిన పథకాలన్నీ రద్దు చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రిపై ఒట్టేసి చెబుతున్నారని, కానీ చేయడంలేదని, ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కొట్లాడి ఎయిమ్స్‌ను తీసుకొచ్చారని గుర్తు చేశారు. బూర నర్సయ్య గౌడ్ నాడు ఎంపీగా ఉన్నా ఏం చేయలేదని, మళ్లీ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడగటానికి వస్తున్నారని ప్రశ్నించారు. భువనగిరి, ఆలేరు, జనగాంలో నీటి కోసం ఎంతో గోస ఉండేదని, ట్యాంకర్లు, బిందెలతో నీళ్లు పట్టుకునేదని గుర్తు చేశారు. ఈ కష్టాలన్నీ పోగొట్టి అనేక విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. బస్వాపూర్ ప్రాజెక్టును పూర్తి చేశామని, దీని ద్వారా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో అభ్యర్థి క్యామ మల్లేశ్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఉమామాధవరెడ్డి, మాజీ ఎంపీలు జోగినిపల్లి సంతోష్ రావు, బడుగుల లింగయ్యయాదవ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి, తొట్ల స్వామి, ఒంటెద్దు నరసింహారెడ్డి, సుదగాని హరిశంకర్ గౌడ్, తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.