ఇబ్రహీంపట్నం, జూలై 5 : రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీలు పగటి కలలు కంటున్నాయని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన యువసమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు పూటకో అబద్ధం మాట్లాడుతూ.. అధికారం కోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నాయని, ఆ పార్టీ నేతల కలలు కలగానే మిగిలిపోతాయని అన్నారు.
కరువు బృందాలు రాష్ర్టానికి వచ్చిన ప్రతీసారి ఇబ్రహీంపట్నం చెరువు చూసి రాష్ట్రంలో కరువు అంచనా వేసేవారని అన్నారు. కాని, ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ కింద రూ.16కోట్లతో కాల్వల మరమ్మతు చేపట్టడం వలన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నేడు నిండుకుండలా మారి నీటితో కళకళలాడుతుందన్నారు. త్వరలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు.
రాష్ట్ర ఐటీశాఖమాత్యులు కేటీఆర్ ప్రత్యేక చొరవతో కొంగరకలాన్ వద్ద ఏర్పాటు చేయనున్న ఫాక్స్‌కాన్ సంస్థలో మరో 9 మాసాల్లో ఈ ప్రాంతానికి చెందిన సుమారు 50వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. అలాగే, నిరుద్యోగ యువతీ యువకులకు అండగా.. ఎంకేఆర్ ఫౌండేషన్‌ను స్థాపించి అనేకమందికి ఉచిత శిక్షణ ఇప్పించటం వలన సుమారు 1100మందికి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటానికి దోహదపడిందన్నారు. ఇందులో 326మంది మహిళలు కూడా ఉద్యోగాలు సాధించారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఎంకేఆర్ ఫౌండేషన్‌తో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగసంస్థల్లో కూడా ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలను ఇప్పిస్తామని అన్నారు.
ఇబ్రహీంపట్నం ప్రాంత అభివృద్ధితో పాటు యువతకు అండగా నిలుస్తున్న మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డికి ఈ ప్రాంత యువత ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుంచి మూడుసార్లు వివిధ పార్టీల నుంచి పోటిచేసిన మల్రెడ్డి రంగారెడ్డిని ప్రజలు ఘోరంగా ఓడించారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయని, అలాంటి వారుకూడా అధికారంలోకి వస్తామని చెప్పుకోవటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి ఆశీర్వదించటానికి యువత నడుం బిగించాలన్నారు.
ఇబ్రహీంపట్నంలో గెలిచేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని అన్నారు. యువసమ్మేళనం నిర్వాహకుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యువత ఎంతో చైతన్యవంతులని అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్యుత్ వంటి అనేక మౌలిక వసతులు కల్పించారని అన్నారు. అలాగే, ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఎంకేఆర్ ఫౌండేషన్‌ను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఇప్పటికే నియోజకవర్గంలో టీసీఎస్, ఏరోస్పేస్, బీడీఎల్, కాగ్నిజెంట్ వంటి సంస్థల ఏర్పాటుతో పాటు ఎన్ఎస్జీ, ఆక్టోపస్ వంటి సంస్థలతో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని అన్నారు. త్వరలోనే నియోజవకర్గంలో కొంగరలో ఫాక్స్‌కాన్ సంస్థ, ఎలిమినేడులో ఏరోస్పేస్ సంస్థ, తాళ్లపల్లిగూడలో మరిన్ని సంస్థలు ఏర్పాటు కానున్నాయని, వీటిలో ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ జంగమ్మ, డీసీసీబీ వైస్‌చైర్మన్ కొత్తకుర్మ శివకుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆకుల యాదగిరి, బీఆర్ఎస్ యాచారం మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, మంచాల అధ్యక్షుడు చీరాల రమేశ్, ఇబ్రహీంపట్నం అధ్యక్షుడు బుగ్గరాములు, అబ్దుల్లాపూర్‌మెట్ అధ్యక్షుడు కిషన్‌గౌడ్, మున్సిపాలిటీల అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, జంగయ్య, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజవకర్గ అధ్యక్షుడు రాజు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జగదీశ్వర్, మున్సిపల్ అధ్యక్షుడు శివసాయి, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, మండల అధ్యక్షులు ప్రవీణ్‌నాయక్, ప్రసాద్‌గౌడ్, శ్రీశైలం, నాయకులు సాయి, అరవింద్, జానయ్యగౌడ్, జానీపాషా, బద్రీనాథ్గుప్తా, రాము, భగీరథ్సాగర్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం దివంగత ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.