రంగారెడ్డి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కొహెడలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించాలని తలపెట్టిన పండ్లమార్కెట్కు మంచిరోజులు వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదిగా కొహెడ పండ్ల మార్కెట్‌ను నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా స్థలసేకరణ, నిధుల కేటాయింపు వంటి కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వం మారడంతో పండ్ల మార్కెట్ నిర్మాణ విషయంలో జాప్యం జరిగింది. నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులు పండ్ల మార్కెట్ నిర్మాణ విషయమై ఇటీవల మార్కెటింగ్ శాఖ అధికారులను కలిశారు.
దీంతో స్పందించిన అధికారులు శుక్రవారం కొహెడ గ్రామ పరిధిలో గతంలో ఏర్పాటు చేయాలనుకున్న పండ్ల మార్కెట్‌ను సహాయ సంచాలకులు ఉదయ్‌కుమార్ పరిశీలించారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. కాగా, ఇప్పటి వరకూ పనులను పట్టించుకోకపోవడంపై స్థానిక వ్యాపారులు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ను బాటసింగారం పండ్ల మార్కెట్‌కు తరలించిన నేపథ్యంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి సొంతంగా స్థలం లేకుండా పోయింది. గతంలో పండ్ల మార్కెట్ స్థలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1000 పడకల దవాఖానను నిర్మించాలని తలపెట్టింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా… కొహెడలో అత్యాధునిక వసతులతో నిర్మించేందుకు స్థల సేకరణ కూడా చేపట్టింది.
ఈ నేపథ్యంలో ఫేస్-1 పనుల్లో భాగంగా అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పలుమార్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించి మార్కెట్ నిర్మాణ పనులకు మార్గాన్ని సుగమం చేశారు. ప్రభుత్వం మారడంతో నూతన మార్కెట్ నిర్మాణానికి జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పుడు ఆ పనులను పూర్తి చేస్తామని హడావుడి చేస్తుండడం గమనార్హం. త్వరలో సీఎం కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తారని మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ ఈ పనులను పట్టించుకోకపోవడంపై స్థానిక వ్యాపారులు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.