వికారాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి జెట్ స్పీడ్‌లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఊరూరా ప్రచారం నిర్వహిస్తుండగా.. తాండూరు, పరిగి నియోజకవర్గాల మండల స్థాయి పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోపాటు దేశంలో ఎక్కడాలేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అస్ర్తాలుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలోని ఆయా పథకాలకు సంబంధించిన అన్ని హామీలను బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పింఛన్లు రూ.6016లకు పెంపు, ఆరోగ్య రక్ష రూ.15 లక్షలకు పెంపు, రైతుబంధు సాయం రూ.16 వేలు, రూ.400లకే వంట గ్యాస్ సిలిండర్ వంటి అంశాలను ప్రజలకు తెలియజేస్తుండడంతో విశేష స్పందన లభిస్తున్నది. అభివృద్ధి, సబ్బండ వర్ణాల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం, మూడోసారి రానున్నది బీఆర్ఎస్ పార్టీయేనంటూ వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వందలాదిగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల అభ్యర్థులు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి ఊరూరా ప్రచారం నిర్వహిస్తున్నారు. వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామం నుంచి ఆనంద్, బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లి గ్రామం నుంచి నరేందర్‌రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు బోనాలతో, డప్పు చప్పుళ్లు, ఎడ్లబండ్ల ర్యాలీలతో ఊరంతా ఒక్కటై ఘన స్వాగతం పలుకుతున్నారు. గత తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమానికి వేలాదిగా తరలివస్తూ గులాబీ పార్టీకి జైకొడుతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఏం చేస్తామనే తెలిపే ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలను అభ్యర్థులు గడపగడపకూ తీసుకెళ్తున్నారు. అరకొరగా ఉన్న పింఛన్ డబ్బులను రూ.6016లకు చేస్తామంటున్న కేసీఆర్‌కే మా ఓటంటూ కొడంగల్, వికారాబాద్ నియోజకవర్గాల ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను దీవిస్తున్నారు.
వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్‌కు మద్దతుగా ఆయన సతీమణి సబితాఆనంద్తోపాటు కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు గల్లీగల్లీల్లో ప్రచారం చేస్తుండగా.. కొడంగల్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డితోపాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లి వాడవాడలా ప్రచారం నిర్వహిస్తున్నారు. మెతుకు ఆనంద్ ఇప్పటివరకు వికారాబాద్ మండలంలోని పెండ్లిమడుగు, ఎర్రవల్లి,
పులుమద్ది, నారాయణపూర్, అత్వెల్లి గ్రామాల్లో, ధారూరు మండలంలోని కేరెల్లి, ఎబ్బనూరు, అల్లీపూర్, హరిదాసుపల్లి, చింతకుంట, ధారూర్ స్టేషన్, ధారూరు, రాంపూర్, గట్టేపల్లి, రుద్రారం గ్రామాల్లో, కోట్‌పల్లి మండలంలోని బీరోల్, జిన్నారం, రాంపూర్, ఎన్కెపల్లి, ఎన్నారం, కొత్తపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లి, మదన్‌పల్లి తండా, దుద్యాల, బూరాన్పూర్, సూర్యానాయక్‌తండా, గట్టునాయక్తండా, ఎర్రతండా, సాలెండాపూర్, కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుతోపాటు గుండుమాల్‌లో ఇప్పటివరకు కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం పూర్తి చేశారు.
తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో మండలస్థాయి సమావేశాలతో బీఆర్ఎస్ అభ్యర్థులు పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో మండలాల సమావేశాలతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం హోరెత్తుతున్నది. ప్రతి మండలంలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు అధిక సంఖ్యలో మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, తాండూరు మండలాలతోపాటు తాండూరు టౌన్‌కు సంబంధించిన పార్టీ సమావేశాలు పూర్తయ్యాయి. పరిగి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే కుల్కచర్ల, గండీడ్, మహమ్మదాబాద్, పూడూరు మండలాలకు సంబంధించి మండలస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలు పూర్తయ్యాయి.
మండలాల సమావేశాలే వేదికగా తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధితోపాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను సమావేశాల్లో తీసుకెళ్తున్నారు. తాండూరు, పరిగి అభ్యర్థులకు ప్రజల నుంచి సూపర్ స్పందన వస్తున్నది. ఒక్కో మండలంలో 5 వేలకుపైగా జనాలు సమావేశాలకు తరలివస్తున్నారు. తాండూరు నియోజకవర్గ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డికి మద్దతుగా ఆయన తల్లి, వికారాబాద్ జడ్పీటీసీ ప్రమోదినీరెడ్డితోపాటు ఆయన సతీమణి ఆర్తి బతుకమ్మ కార్యక్రమాలతోపాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు. పరిగి నియోజకవర్గ అభ్యర్థి మహేశ్‌రెడ్డికి మద్దతుగా ఆయన సోదరుడు అనిల్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రతిమారెడ్డి ప్రచారం చేస్తున్నారు.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అభివృద్ధి, సంక్షేమంతోపాటు బీఆర్ఎస్తో సబ్బండ వర్ణాలకు సంక్షేమమని తెలుసుకున్న అన్ని వర్ణాల ప్రజలు గులాబీ కండువా వేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి వేలాదిగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.