షాద్‌నగర్‌టౌన్, నవంబర్ 12: వీధి కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ కుక్కల దాడిలో గాయాలపాలైనా సంఘటనలు ఎక్కడో ఒక చోట చూస్తునే ఉన్నాం. వీధి కుక్కల నియంత్రణకు అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వీధి కుక్కల దాడిలో అటూ చిన్నారులు ఇటూ పెద్దలు గాయాలపాలవుతున్నారు. వీధి కుక్కలను చూస్తేనే భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కల దాడి ఓ బాలుడు తన ఎడుమ కన్నును కొల్పోయిన సంఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జనార్ధన్ -జ్యోతి దంపతుల మూడు సంవత్సరాల కుమారుడు రిత్విక్ మూడ్రోజుల క్రితం ఇంట్లో ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు రావడంతో ఇంటి బయట ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. వీధి కుక్కల దాడితో బాలుడు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. కుక్కల దాడిలో ఎడుమ కన్నుకు తీవ్ర గాయమైనా బాలుడిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం బాలుడిని హైదరాబాద్ సరోజిని కంటి దవాఖానకు తరలించి వైద్యం అందించారు.
వీధి కుక్కల దాడిలో బాలుడు ఎడుమ కన్నును కొల్పోయాడు. ఎడుమ కన్నును కొల్పోయిన బాలుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీధి కుక్కలను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని, ఎక్కడి నుంచి తీసుకొచ్చి మా గ్రామంలో వీధి కుక్కలను వదులుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వీధి కుక్కల నియంత్రణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కల దాడిలో ఎడుమ కన్నును కొల్పోయిన బాలుడిని చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.