బోనస్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత యాసంగిలో జిల్లాలోని అధికారులు 20,000 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని 40,000 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. అందుకు రూ. 10 కోట్ల వరకు డబ్బు లు చెల్లించాల్సి ఉన్నది. తమకు ఇంకా బోనస్ డబ్బులు అందలేదని రైతులు అధికారులను అడిగితే నిధు ల కొరత అని తిప్పి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు గడుస్తున్నా ఇంకా డబ్బులు రాకపోవడంతో బోనస్.. బోగసేనా అని ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
రంగారెడ్డి, జూలై 11 (నమస్తే తెలంగాణ) : సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ జిల్లాలో నేటికి ఇంకా రాలేదు. గత యాసంగిలో సన్న వడ్లు పండించిన రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు అమ్మి సుమారు మూడు నెలలు
పూర్తవుతున్నా.. డబ్బులు తమ బ్యాం కు ఖాతాల్లో జమ కాకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా నిధుల కొరతతో చెల్లించలేకపోతున్నదని అధికారులు కార్యాలయాలకు వస్తున్న రైతులకు చెప్పి తిరిగి పంపిస్తున్నారు.
గత యాసంగిలో జిల్లాలో డీసీఎంఎస్, ఐకేపీ, సహకార సంఘాల ద్వా రా 20 వేల మెట్రిక్ టన్నుల సన్న వడ్ల ను అధికారులు కొనుగోలు కేంద్రాల దాదాపుగా 40,000 మంది రైతుల నుంచి సేకరించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడే క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్‌గా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ధా న్యం విక్రయించి సుమారు మూడు నెలలు పూర్తవుతున్నా.. ఇంకా రూ. 10 కోట్ల వరకు డబ్బులు బ్యాంకు ఖా తాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అసలు బోనస్ వస్తుందా..? బోగసేనా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులు పండించిన సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలి. 19 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు నాలుగు పంటలు పూర్తైనా నేటికీ బోనస్ డబ్బులు అందించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైంది. పాలకులు స్పందించి అన్నదాతలను బోనస్ డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి.
– మొద్దు అంజిరెడ్డి, రైతు