రంగారెడ్డి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ నీటి మూటగానే మారిపోయింది. గత యాసంగిలో సన్న వడ్లు విక్రయించిన రైతులకు ఆరునెలలు గడిచినా బోనస్ డబ్బులు మాత్రం రావడం లేదు. జిల్లాలో సుమారు రూ.7 కోట్ల వరకు రైతులకు బోనస్ డబ్బులు రావాల్సి ఉన్న ది. గత ఖరీఫ్‌లో విక్రయించిన ధాన్యం బోనస్ డబ్బులు ఇవ్వక పోవడంతో ఈ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది.
కేంద్రం సహకరిస్తేనే ధాన్యాన్ని కొంటామని.. లేకపోతే సాధ్యం కాదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. రైతులను ప్రో త్సహించడంతోపాటు వారికి గిట్టుబాటు ధర ఇస్తామని, అలాగే, క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో జిల్లాలో గత యా సంగిలో ఏప్రిల్ 20-జూన్ 31 వరకు 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 5,744 మంది రైతుల నుంచి 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు.
ఈ వానకాలంలో జిల్లాలో 1,25,000 ఎకరాల్లో వరిని సాగుచేశారు. ఈ ఏడాది కూడా దిగుబడి గణనీయంగా వచ్చే అవకాశాలున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోళ్లపై ముందుగానే చేతులెత్తేసింది. కేంద్రం సహకరిస్తేనే కొంటామని చెప్పడంతో జిల్లాలోని రైతులు పండించిన ధాన్యం విక్రయంపై తర్జనభర్జన పడుతున్నారు.
జిల్లాలో గత యాసంగిలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి బోనస్ కింద సుమారు రూ.7 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. బోనస్ డబ్బుల కోసం అన్నదాతలు ఇంకా వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా అధికారులు మాత్రం నోరుమెదపడం లేదని.. కొనుగోలు చేసినప్పుడు బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఇవ్వకపోవడంపై రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.