వికారాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అ భ్యర్థులను ప్రకటించి నెల రోజులు దాటుతున్న ది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు వరుసగా వేలాది మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడంతో ఫుల్ జోష్‌తో ముందుకెళ్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే డీలా పడ్డాయి. పోటీ చేసే ఆశావహు ల నుంచి దరఖాస్తులను స్వీకరించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క నియోజకవర్గానికి కూడా ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం.
ఆశావహులు ఉన్నా..
ప్రధానంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు ఆశావహులు ఎక్కువగానే ఉన్నా బలమైన క్యాడర్ కలిగిన అభ్యర్థులు లేకపోవడంతో బీజేపీలో దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో బీజేపీకి క్యాడరే కాదు, నాలుగు నియోజకవర్గాలైన వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన నాయకులు కూ డా లేరని.. జిల్లాలో అస్సలు క్యాడరే లేని బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమేనంటూ అన్ని వర్గాల మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. గత ఎన్నికల్లోనూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపినప్పటికీ తాండూరు నియోజకవర్గం మిన హా మిగతా నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి కేవలం 1973 ఓట్లు మాత్రమే పోలై ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నోటాకు పడిన ఓట్లతో పోటీపడడం గమనార్హం. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు కనీసం 2 వేల ఓట్లు కూడా పడకపోవడం గమనార్హం.
ఎంపీ అభ్యర్థులపై ఆశలు…
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. బీజేపీ ఎంపీ అభ్యర్థులను బరిలోకి దింపి ఒక్క నియోజకవర్గంలోనైనా గెలుపు దేవుడెరుగు రెండో స్థానంలోనైనా నిలిచేందుకు ఆరాటపడుతున్నారు. అయితే ఎంపీ అభ్యర్థులు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. జిల్లాలోని తాండూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డిని బరిలోకి దింపే ఆలోచనలో ఆ పార్టీ ఉండగా, కొండా మాత్రం పోటీ చేయలేనంటూ చెప్పినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
పోటీ చేయండి ప్లీజ్
జిల్లాలో బీజేపీ తరఫున పోటీ చేసే ఆశావహుల నుంచి ఆ పార్టీ దరఖాస్తులను స్వీకరించింది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు 58 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో 2 వేల ఓట్లు కూడా రాని కొడంగల్ నియోజకవర్గం నుంచి 25 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కొడంగల్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికీ కూడా సొంతంగా వంద ఓట్లు పడని వారే ఉన్నారు. అలాగే పరిగి నియోజకవర్గం నుంచి భునేటి కిరణ్, ఘణపురం వెంకటయ్య తదితరులు దరఖాస్తు చేసుకొన్నారు. శంషాబాద్ ప్రాంతానికి చెందిన భునేటి కిరణ్‌కు స్థానికేతరుడని ముద్ర ఉంది. ఒకవేళ బరిలో దింపినప్పటికీ డిపాజిట్ ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఎన్నికల్లో స్థానికుడైన ప్రహ్లాద్‌రావు పోటీ చేయడంతో 6 వేల ఓట్లు పోలయ్యాయి. ఈ దఫా ఎన్నికల్లో ఇంకా తక్కువ ఓట్లు పడే పరిస్థితులున్నాయనే అభిప్రా యం వ్యక్తమవుతున్నది.
వికారాబాద్‌లో..
వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో బీజేపీ నుంచి పోటీ చేసే అర్హత ఉన్న నాయకులు ఒక్కరూ లేకపోవడంతో పార్టీ జిల్లా నాయకత్వానికి తలనొప్పిగా మారింది. రెండు నెలల క్రితం వరకు మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ బీజేపీ బరిలో ఉండడం ఖాయమని అనుకున్నప్పటికీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కలేనని భావించిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఏ.చంద్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన వెంట ఉన్న క్యాడర్ కూడా కాంగ్రెస్‌లో చేరడం, వికారాబాద్ నియోజకవర్గంలో పోటీలో దింపేందుకు డిపాజిట్ ఓట్లు వచ్చే నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
తాండూరులో..
తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గత ఎన్నికల్లో పోటీ చేసిన పటేల్ రవిశంకర్‌తోపాటు లక్ష్మారెడ్డి, రమేశ్‌కుమార్, నరేశ్ మహారాజ్ దరఖాస్తు చేసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న పటేల్ రవిశంకర్ ఈ దఫా ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. పార్టీ అధిష్టానం మాత్రం మరొకరిని దింపే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అలాగే గత ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి రాకపోవడంతో సొంత ప్రయోజనాలకు బీఆర్ఎస్ పార్టీలో చేరి తిరిగి బీజేపీలో చేరి టికెట్ ఆశిస్తున్న రమేశ్‌కుమార్‌ను కూడా బీజేపీ అధిష్టానం నమ్మే పరిస్థితి లేదు.