ఆమనగల్లు, ఫిబ్రవరి 3 : రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు శంకరగిరి మాన్యాలే దిక్కని, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువడం ఖాయమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన చంద్రాయన్పల్లి పెద్ద తండా, చిన్న తండా, రామ్‌నగర్ తండాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. దీంతో కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ 3146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల దశాబ్దాల కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు. గిరిజనుల జనాభా పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక సమస్యలు సృష్టించినప్పటికీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన మహానేత కేసీఆర్ అని అన్నారు. గిరిజనుల కోసం బంజారాహిల్స్‌లో రూ. 24.68 కోట్లతో ఆదివాసీ భవన్, రూ.24.43 కోట్లతో బంజరాభవన్ నిర్మించిన ఘనత కేవలం బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 నియోజకవర్గాల్లో గిరిజన భవన్లు నిర్మించారన్నారు.
ఇందులో భాగంగానే ఆమనగల్లు మున్సిపాలిటీలో సంత్ సేవాలాల్ గిరిజన భవన్ రూ.2.5 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. తండాలకు రోడ్లు వేయడం, ఎస్టీ గురుకులాల ఏర్పాటు వంటివి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. గిరిజనుల అభివృద్ధికి రూ.8750 కోట్లు ఎస్టీ సబ్‌ప్లాన్‌లో కేటాయించిందన్నారు. రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వస్తే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు తండాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ దోనాదుల కుమార్, సీనియర్ నాయకులు ఎంగలి రఘు, గుత్తి బాలస్వామి, శ్రీనూనాయక్, నాయకులు కొమ్ము ప్రసాద్, రమేశ్‌నాయక్, వెంకటేశ్, గణేశ్, హేమ్లా నాయక్, కుమార్ నాయక్, పంతూనాయక్, నిరంజన్, జైపాల్, శ్రీకాంత్, శ్రీను, గోపాల్, మల్లేశ్ ఉన్నారు.