రంగారెడ్డి, జూన్ 4(నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు లోక్‌సభ ఎన్నికల ఘట్టం ముగిసింది. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక ఫలితం వెలువడడంతో ఉత్కంఠకు తెరపడింది. చేవెళ్ల లోక్‌సభ బరిలో 43 మంది నిలవగా.. 16,57,107 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల ఓటర్లు ఏకపక్షంగా విజయాన్ని అందించారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రంజిత్‌రెడ్డికి చేవెళ్ల ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 8,09,882 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి 6,36,985 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు 1,78,968 ఓట్లు వచ్చాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 1,72,897 మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది.
ఎన్నికల విధుల్లో 671 మంది..
చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామునే కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పాస్‌లు ఉంటేనే లోపలికి అనుమతిచ్చారు. లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈవీఎంలను లెక్కించారు. ఓట్లను లెక్కించేందుకు నియోజకవర్గాల వారీగా 165 టేబుళ్లను ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ ప్రక్రియను రికార్డు చేశారు. మధ్యాహ్నానికే గెలుపోటములపై స్పష్టత వచ్చింది. సాయంత్రం 6.30 గంటలకు దాదాపుగా పూర్తి ఫలితం వచ్చింది. ఎన్నికల విధుల్లో మొత్తం 671 మంది సిబ్బంది పాల్గొన్నారు.
రంజిత్ రెడ్డికి గట్టి షాక్..
మంగళవారం వెల్లడైన చేవెళ్ల పార్లమెంట్ ఫలితాల్లో చేవెళ్ల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇక్కడి ఓటర్లు బుద్ధి చెబుతూ వస్తుండగా.. తాజా ఎన్నికలోనూ అదే పునరావృతమైంది. 2014 ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ ఫిరాయించి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేయగా ఇక్కడి ప్రజానీకం ఓడించింది.
అలాగే.. 2019 ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన రంజిత్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అందరూ ఊహించినట్లుగానే ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిపత్యం కొనసాగిస్తూ రావడంతో..ఓటమిని ముందే అంగీకరించిన రంజిత్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.