వికారాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనులకు మోక్షం లభించడంలేదు. మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు పనులకు రెండేండ్ల క్రితమే నిధులు విడుదలై ఉత్తర్వులిచ్చినా ఇంకా ప్రారంభించకపోవడం గమనార్హం. మన్నెగూడ నుంచి కొడంగల్ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులను గతంలోనే పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం మన్నెగూడ-అప్పా జంక్షన్ వరకు రహదారి విస్తరణ పనులను పెండింగ్లో పెట్టింది.
తదనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రహదారి విస్తరణ పనులకు అనుమతులొచ్చాయి. భూ సేకరణ నిర్వాసితులకు నష్టపరిహారం అందజేసినప్పటికీ పనుల ప్రారంభంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ రహదారిపై ఏదో ఒక చోట నిత్యం ప్రమాదాలు జరుగుతూ మృత్యువాత పడుతున్నా కాంగ్రెస్ సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తున్నది.
దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులపై ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులను ఎక్కడిక్కడ నిలదీస్తుండడంతో మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా మట్టి పోసి వదిలేసి చేతులు దులుపుకోవడం గమనార్హం. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతుంటే కేవలం మట్టి పోసి వదిలేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మూడు, నాలుగేండ్లుగా బీజాపూర్ జాతీయ రహదారి అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, కర్నాటకలోని బీజాపూర్ వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతపు సెలవుల్లో అయితే చెప్పనలవికాదు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లకూ ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నది. మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు 46 కిలోమీటర్లు వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతున్నదంటే ట్రాఫిక్ ఎలా ఉంటున్నదో అర్థం చేసుకోవచ్చు. భారీ వాహనాలు ముందు వెళ్తున్నాయంటే దారి పొడవునా ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో వీఐపీ కాన్వాయ్ మాదిరి వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి.
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి రూ.928.41 కోట్లతో రహదారి నిర్మాణానికి అంచనాలను రూపొందించారు. తొలుత రూ.800 కోట్లతో రహదారి విస్తరణ పనులకు సంబంధించి అంచనాలను రూపొందించినప్పటికీ, తదనంతరం మరో రూ.128 కోట్లకు పెంచారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ రహదారి ప్రస్తుతం కొన్ని చోట్ల 25 మీటర్లు, మరికొన్ని చోట్ల 30 మీటర్లుగా ఉన్నది. రోడ్డు విస్తరణలో భాగంగా 60 మీటర్ల మేర రహదారి విస్తరించి నాలుగు లేన్లుగా మార్చనున్నారు. ఇప్పటికే మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్, బీజాపూర్ వరకు 45 మీటర్ల మేర మూడు లేన్ల రహదారిగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వెళ్లే జాతీయ రహదారి మధ్య ఉన్న గ్రామాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా అండర్పాస్ బ్రిడ్జిలను కూడా నిర్మించనున్నారు. 46 కిలోమీటర్ల పరిధిలో ఆరు భారీ అండర్పాస్ బ్రిడ్జిలను, ఎనిమిది ప్రాంతాల్లో చిన్న అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు. బైపాస్ రోడ్లను కూడా నిర్మించేందుకు ప్లాన్ చేశారు. రెండు బైపాస్ రోడ్లు కూడా జిల్లాలోనే నిర్మించనున్నారు. మొయినాబాద్ వద్ద 4.35 కిలోమీటర్ల మేర, చేవెళ్ల వద్ద 6.36 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. నాలుగు లేన్ల రహదారిగా విస్తరిస్తున్న దృష్ట్యా 12 లేన్ల టోల్ ప్లాజాను అంగడిచిట్టంపల్లి వద్ద ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.