రంగారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భూ సమస్యల పరిష్కారం అధికారులకు కత్తిమీద సాములా మారింది. జిల్లావ్యాప్తంగా భూ సంబంధిత సమస్యలు పెద్దఎత్తున ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ భూ భారతి ద్వారా పరిష్కారం చూపుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం గ్రామాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులను కూడా తీసుకున్నారు. ఈ దరఖాస్తులన్నింటినీ ఈ నెల 15లోగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు.
గడువు సమీపిస్తున్నప్పటికీ భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను భూములు లేని పేదలకు గతంలో ప్రభుత్వాలు అందజేశాయి. జిల్లావ్యాప్తంగా 90,915 ఎకరాలుండగా.. ఇందులో సుమారు 52,350 మంది రైతులకు 75 వేల పైచిలుకు ఎకరాలను అసైన్డ్ చేసింది.
ఈ భూములకు సంబంధించి పట్టాలతో పాటు గతంలో రెవెన్యూ అధికారులు మరికొంతమందికి పట్టా సర్టిఫికెట్లను కూడా ఇచ్చారు. దీంతో భూమి తక్కువగా ఉండి, పాస్‌బుక్కులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులు రికార్డులున్నా పొజిషన్లో లేకుండా కొంతమంది ఉండగా.. కబ్జాలో ఉన్నా రికార్డుల్లో లేకుండా మరికొంతమంది ఉన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే కబ్జా చేస్తున్న రైతుల వివరాలను సర్వే ద్వారా సేకరించాల్సి ఉన్నది. కాని, సర్వేయర్లు అందుబాటులో లేకపోవడం వలన ఈ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయి.
గత భూ భారతి సదస్సుల ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 21వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఇందులో సుమారు 9వేల దరఖాస్తుల వరకు మిస్సింగ్ సర్వే నంబర్ల కోసమే వచ్చాయి. ఈ మిస్సింగ్ సర్వే నంబర్ల సమస్యలన్నీ కబ్జాలో ఒకరు ఉండగా.. రికార్డుల్లో మరొకరు ఉన్న సమస్యలే అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు ఇబ్రహీంపట్నం ఖల్సాలోని సర్వే నం.1146లో భూమి కంటే పాస్బుక్కులే అధికంగా ఉన్నాయి. ఇందులో అధికంగా పాస్‌బుక్కులు ఉండటం వలన ఎవరికి కబ్జా ఉంది.. ఎవరికి కబ్జా లేదో సర్వే చేయాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ కబ్జాలో లేకుండా ఎంతోమంది రైతులున్నారు. తమ సర్టిఫికెట్లకు సంబంధించిన భూమిని సర్వే చేసి చూపించాలని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, సర్వే నంబర్ 58 ప్రభుత్వ భూమిలో కూడా ఇదే సమస్య ఉన్నది. ప్రతి మండలంలోనూ ఇలాంటి సమస్యలే అత్యధికంగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఫీల్డ్‌పై సర్వే చేసి అర్హులెవరో.. అనర్హులెవరో తేల్చాల్సి ఉన్నది. సర్వేలు లేకపోవడం వలన ఈ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు.
రంగారెడ్డిజిల్లాలో పట్టా భూములతోపాటు అసైన్డ్, సీలింగ్, ఇనామ్, లావణితో పాటు శిఖం పట్టా భూములున్నాయి. అనేక సర్వే నంబర్లలోని భూములు రెవెన్యూ నక్షాకు భిన్నంగా ఉన్నాయి. భూ విస్తీర్ణానికి మించి విస్తరణలో పేర్లు నమోదవడంతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేశారు. నిజమైన లబ్ధిదారులతోపాటు అడ్డదారిలో భూములు కొల్లగొట్టినవారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అసలు ఎవరో.. నకిలీ ఎవరో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.