రంగారెడ్డి, ఆగస్టు 11 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో అత్యంత విలువైన భూదాన్ భూములు కాపాడటంలో అధికారులు ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారు. భూదాన్ భూముల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన బోర్డు రద్దు కావటంతో అధికారులు ఎవరూ పట్టించుకోవటంలేదు. ఇదే అదునుగా రియల్ఎస్టేట్ వ్యాపారులు ఈ భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూదాన్భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికి భూదాన్ భూముల వివరాలు వెలికితీసి నివేదిక ఇవ్వటంలో అధికారులు స్పందించటం లేదని ఆరోపణలున్నాయి.
భూదాన్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మహేశ్వరం వంటి మండలాల్లో పెద్ద ఎత్తున భూదాన్ భూములున్నాయి. ఉన్నాయి. ఈ భూములను కొంతమంది నిరుపేద రైతులు కొనుగోలు కూడా చేశారు. ఈ కొనుగోళ్లపై గతంలో బోర్డు కోర్టుల్లో కేసులు వేసింది. ఆ కేసులను పరిశీలించటానికి అధికారులు న్యాయవాదులను ఏర్పాటు చేయటంలో కూడా నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా కొంతమంది రియల్ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం భూదాన్ భూముల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవటం వలన విలువైన భూములు చేజారిపోయే ప్రమాదముందని పలువురు వాపోతున్నారు…
జిల్లాలో 25వేల ఎకరాలకు పైగా భూదాన్ భూములు..
రంగారెడ్డిజిల్లాలోని 25వేల ఎకరాలకు పైగా భూదాన్‌బోర్డు భూములున్నాయి. ఈ భూములు ఓఆర్ఆర్ పరిసర మండలాల్లో ఉండటం వలన వీటివిలువ గణనీయంగా పెరిగిపోయింది. ఈ భూముల్లో గతంలో 9,679మంది భూములులేని పేదలకు కూడా అందజేశారు. ఈ పట్టాలు తీసుకున్నవారిలో 80శాతంకు పైగా క్రయ విక్రయాలు జరిపారు. నిబంధనల ఉల్లంఘనపై గతంలో పనిచేసిన బోర్డు కేసులను కూడా వేసింది. అయినప్పటికీ కేసులు ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదు. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూముల్లో ఎక్కువశాతం రియల్ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి.
ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి, నాగన్‌పల్లి గ్రామాల్లో 200ఎకరాల భూములు, మహేశ్వరం మండలంలోని సిగిలిపురం, మంఖాల , నాగారం గ్రామాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా భూదాన్ భూములు ఉండగా, ఆ భూములతో పాటు శంషాబాద్ మండలంలోని పాలుమాకుల గ్రామంలో ఉన్న భూములు కూడా రియల్ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పిగ్లీపూర్, అబ్దుల్లాపూర్‌మెట్, బాటసింగారం తదితర గ్రామాల్లో ఉన్న మరో 300ఎకరాలు రియల్ఎస్టేట్ కబ్జాల్లో ఉండగా, ఈ భూములపై కూడా ప్రస్తుతం కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.
కందుకూరు మండలంలోని కందుకూరు, తిమ్మాపూర్, తదితర గ్రామాల్లో కూడా భూదాన్ భూములున్నాయి. అలాగే, యాచారం మండలంలోని యాచారం, చౌదర్పల్లి గ్రామాల్లో వందకు పైగా ఎకరాల భూదాన్ భూములుండగా, ఈ భూమి సైతం రియల్ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే, గండిపేట్ మండలంలోని వట్టినాగులపల్లి గ్రామంలో కూడా 26ఎకరాల అత్యంత విలువైన భూదాన్ భూమి ఉంది. ఈ భూమికూడా రియల్ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేయటంతో కోర్టు కేసులు వేసింది. ఈ కేసు కూడా ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లోనే కొనసాగుతోంది.
క్రయవిక్రయాలపై 200లకు పైగా పెండింగ్ కేసులు..
కోట్లాది రూపాయల విలువచేసే భూదాన్ భూములు ఆక్రమణదారులకు దక్కే విధంగా సహకరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. మహేశ్వరం మండలంలోని మంఖాల, సిగిరిపురంగ్రామాల్లో అత్యంత విలువైన భూదాన్ భూములపై కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నప్పటికీ రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుచేసి విక్రయిస్తున్నారు. మరికొన్నిచోట్ల విల్లాల నిర్మాణం కూడా యథేచ్చగా జరుపుతున్నప్పటికి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
భూదాన్ భూముల్లో నిబంధనలు ఉల్లంఘించి ఆక్రమించుకున్న పలువురిపై వివిధ కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భూములు భూదాన్‌బోర్డుకు సంబంధించినవని, గంతలో బోర్డు పాలకవర్గం కేసులు వేసింది. కానీ, ఆ కేసులను బలంగా వాదించటానికి ప్రభుత్వం నుంచి సరైన ఆధారాలు చూపించటంలో అధికారులు ఉదాసీనత వైఖరి అవలంభిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. కొంతమంది అధికారులు ఈ కేసుల్లో ఆక్రమణదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.