Tanduru | తాండూరు, ఏప్రిల్ 19 : బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం… భద్రేశ్వర స్వామి జాతర మహోత్సవం, శ్రీ భావిగి భద్రేశ్వరుని రథోత్సవం… భక్తజన హృదయ భాగ్యోత్సవం అంటూ తాండూరు పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల కోర్కేలను తీరుస్తూ ఆయురారోగ్య, ఐశ్వర్యాలను, సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి తొమ్మిది రోజుల జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యం ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో సుప్రభాతం, రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం మంగళహారతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం రథోత్సవం అలంకరణకు పురోహితులు, నిర్వాహకులు పూజలు చేసి రంగురంగుల కాగితాలతో తయారు చేసిన అలంకరణ వస్తువులను రథోత్సవంకు అలంకరించారు. సాయంత్రం 6.30 గంటలకు శరణు బసవేశ్వర దేవాలయం, నగరేశ్వర దేవాలయం ముందు నుంచి గాంధీచౌక్ మీదుగా భద్రేశ్వర దేవాలయం వరకు కళశము ఊరేగింపు అనంతరం వేదపండితుల మత్రోచ్ఛరణాలతో కళశమును భద్రేశ్వర స్వామికి జై అంటూ రథంపైకి ఎక్కించారు. భద్రేశ్వర స్వామి ఉత్సావాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం కన్నుల పండువగా జరిగింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర నుంచి వేలాది సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. వేలాది భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో భద్రేశ్వర దేవస్థానం నుంచి ప్రారంభమైన రథోత్సవం బసవన్న కట్ట వరకు లాగి తిరిగి భద్రేశ్వర దేవాలయం సమీపంలో పెట్టారు. రథోత్సవ సమయంలో భక్తులు తమకోరికలు నెరవేరాలని కోరుకుంటు పువ్వులు, పండ్లను రథంపైకి విసిరారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. రథోత్సవంలో పలు సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
శ్రీభావిగి భద్రేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, ఆలయ కమిటీ చైర్మన్ పటేల్ కరణ్‌తో పాటు ఉత్సవ కమిటీ ప్రతినిధులు, తాండూరు పురప్రముకులు, రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.