వికారాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా పేదలకిచ్చిన హామీలు మాత్రం నెరవేరడంలేదు. కేవలం ఆరు గ్యారెంటీలు, ఒకట్రెండు పథకాల గురించి ప్రస్తావించడం మినహా మిగతావాటి ఊసే లేదు. ముఖ్యంగా ఆసరా లబ్ధిదారులకు పింఛన్ పెంచుతామని ఇచ్చిన హామీని ఇప్పటికీ పట్టించుకోవడంలేదు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే రూ.2016 పింఛన్‌ను రూ.4,000., దివ్యాంగులకిచ్చే పింఛన్‌ను రూ.4016 నుంచి రూ.6,000లకు పెంచుతామని హామీనిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓటేసి గెలిపించిన పింఛన్‌దారులు పింఛన్ల పెంపు ఎప్పుడో అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు అంటూ ప్రచారం చేస్తున్నా ప్రతి పథకంలోనూ ఏదో ఒక కొర్రీ పెట్టి అర్హులను లబ్ధిదారుల జాబితాల నుంచి తొలగిస్తుండడంతో పేదలకు పథకాల ఫలాలు అందడంలేదు. అదేవిధంగా కొత్త పింఛన్లను జారీ చేస్తామని చెప్పినా.. ఇప్పటికీ పాత పింఛన్లే ఇస్తుండడంతోపాటు ఆసరా లబ్ధిదారులకు ప్రతినెలా అందించే పింఛన్ డబ్బుల పంపిణీలోనూ తీవ్ర జాప్యం జరుగుతున్నది. పింఛన్ల కోసం కొత్తగా 30 వేలకుపైగా అర్హులైన లబ్ధిదారులు ఎప్పుడెప్పుడు మంజూరు చేస్తారా..? అని ఎదురుచూస్తున్నారు.
ఆసరా పింఛన్‌తోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగులకు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతున్నది. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని పింఛన్‌దారులకు డబ్బుల పంపిణీ ప్రతి నెలా 29 లేదా 30న ప్రారంభమై వారం రోజుల్లో ముగుస్తుండగా.. కొడంగల్ నియోజకవర్గంలోని పింఛన్‌దారులు మాత్రం డబ్బుల కోసం మొదటి వారం పూర్తయ్యే వరకు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నది.
బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెలా 20లోగా పింఛన్లను పంపిణీ చేయగా.. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే ఆసరా పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతుండడంతో పింఛన్‌దారుల్లో అయోమయం నెలకొన్నది. అయితే, కొడంగల్ నియోజకవర్గానికి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆసరా పింఛన్ల నిమిత్తం నిధులు మంజూరవుతుండగా.. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు రంగారెడ్డి జిల్లా నుంచి నిధులు వస్తున్నాయి. కాగా, జిల్లాలో 98,793 మంది పింఛన్‌దారులకు ప్రతి నెలా రూ.24.38 కోట్ల పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు.
ఆసరా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి వృద్ధులు, వితంతువులు, దివ్యాం గులకు అండగా నిలువడంతోపాటు దేశంలో ఎక్కడాలేని విధంగా పింఛన్ డబ్బులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. వృద్ధులు, వితంతువులు, తదితరులకిచ్చే రూ.200 పింఛన్‌ను రూ.1000లకు, దివ్యాంగులకిచ్చే రూ.500 పింఛన్‌ను రూ.1500లకు, తదనంతరం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛన్లను రూ.1000 నుంచి రూ.2016లకు, దివ్యాంగుల పింఛన్లను రూ.1,500 నుంచి రూ.3,016లకు .. తదనంతరం దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు రూ.4,016లకు పెంచి పేదల ప్రభుత్వంగా బీఆర్ఎస్ నిలిచింది.