వికారాబాద్, ఆగస్టు 19 : ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2లక్షల్లోపు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక కొందరికే మాఫీ చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామానికి 60 నుంచి 70 శాతం మేర మూడు విడుతల్లోనూ రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ కార్డు లింక్ పెట్టడం, రెన్యూవల్ చేసుకోకవడంతో పాటు ఏ కారణం లేకున్నా అర్హులైన వారికీ రుణమాఫీ కాలేదు. కొన్ని బ్యాంక్ అధికారులు, సిబ్బంది అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వానికి పంపడం లేదని, రెన్యూవల్ చేసినా చేయనట్లు వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.2లక్షల్లోపు రుణం తీసుకున్న చాలా మంది రైతులకు రుణ మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.
రుణమాఫీ కాకపోవడానికి బ్యాంకు నుంచి తమకు ఎలాంటి సమాచారం రావడం లేదంటున్నారు. బ్యాంకుల చుట్టూ, వ్యవసాయాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసినా తరువాత వస్తాయంటూ మాట దాట వేస్తున్నారని రైతులు దిగులు చెందుతున్నారు. అర్హులైన వారికీ మాఫీ ఎందుకు కాలేదో అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. వికారాబాద్‌లోని కొంపల్లిలో దాదాపుగా 400 మంది రైతులు ఉన్నారు.
ఇందులో 350కి పైగా రైతులు వికారాబాద్‌లోని కెనరా బ్యాంక్‌తో పాటు ఆయా బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. దాదాపు 80 మంది రైతులకు రుణాలు మాఫీ కాగా.. 280 మంది రైతులకు మాఫీ కాలేదు. బ్యాంక్ అధికారులు అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వానికి పంపకపోవడం వల్లే రుణ మాఫీ జాబితాలో పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ కాని రైతులు గత కొన్ని రోజుల క్రితం వికారాబాద్ కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు.
రూ.50వేల రుణ మాఫీ కాలె..
నాకు ఎకరం పొలం ఉన్నది. వికారాబాద్ పట్టణంలోని కెనరా బ్యాంక్‌లో రూ.50వేలు రుణం తీసుకున్నా. ఇప్పటి వరకు బ్యాంక్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. బ్యాంక్, వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి అడుగగా, మరో విడుతలో వస్తాయంటూ మాట దాట వేస్తున్నారు. మా ఊరి రైతుల ఖాతాలు ఈ బ్యాంకులో చాలా ఉన్నాయి. కొద్ది మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. బ్యాంక్ అధికారుల నిరక్ష్యమో, ప్రభుత్వ వైఫల్యమో వారికే తెలియాలి. రైతుల గోసను ప్రభుత్వం పట్టించుకోవాలి.
– వెంకటయ్య, కొంపల్లి, వికారాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది…
నాకు 24 గుంటల భూమి ఉన్నది. వికారాబాద్ కెనరా బ్యాంక్‌లో రూ.34 వేల రుణం తీసుకున్నా. వెంట వెంటనే రెన్యూవల్ కూడా చేశా. ఎన్నికల్లో మాయ మాటలు చెప్పిన కాంగ్రెస్… రైతులను మోసం చేస్తున్నది. మూడు విడుతల్లోనూ రుణం మాఫీ కాలె. రోజూ బ్యాంకు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా. అర్హులైన రైతుల జాబితాను బ్యాంక్ అధికారులు ప్రభుత్వానికి పంపారా ? లేదా అనే అనుమానం వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం చేయాలి.
– సంద నర్సింహులు, కొంపల్లి, వికారాబాద్