ఆదిబట్ల, ఆగస్టు 12: నిరంతరం వర్షాల దృష్ట్యా రానున్న రెండు రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అధికారులతో కలిసి భారీ వర్షాలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు తమ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. తప్పనిసరిగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకుని 24 గంటలు అందుబాటులో ఉండేవిధంగా చూసుకోవాలని అన్నారు. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పాఠశాలలు, హాస్టళ్లతో పాటు శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి ఖాళీ చేయించాలని అన్నారు. వరదలు, ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర పరిస్థితిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూం నంబర్ 79931 03347, 040-23237416కు సమాచారం అందించాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో సంగీత, డీఆర్డీఏ పీడీ శ్రీలత, డీపీవో సురేశ్మోహన్, వ్యవసాయశాఖ అధికారి ఉషా, హౌసింగ్ పీడీ నాయక్, డీఈవో సుశీంద్రరావు, ఎస్సీ సంక్షేమ అధికారి రామారావు పాల్గ్గొన్నారు.