వికారాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు ధోకా జరిగింది. 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల నాయకులు ఉద్యమిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిండా ముంచింది. జిల్లాలో గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే బీసీలకు చాలా స్థానాలు తగ్గా యి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఎన్నికల్లో పంచాయతీ స్థానాలు పెరిగినా బీసీలకు కేటాయించే రిజర్వేషన్లలో మాత్రం ప్రభుత్వం కోత విధించింది.
42 శాతం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో తేలుతుందని తెలిసినా 42శాతం రిజర్వేషన్ను కల్పిస్తామని ప్రచారం చేసి చివరకు బీసీలను దగా చేసింది. ఇప్పటికే బీసీలకు 42శాతం రిజర్వేషన్ను కల్పిస్తామని జీవోను తీసుకు రాగా.. హైకోర్టు చీవాట్లతో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీవో నంబర్ 46ను తీసుకొచ్చి రేవంత్ సర్కార్ బీసీలను మరోసారి మోసం చేసింది.
గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే బీసీలకు 19 స్థానాలు కోత విధిస్తూ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గత ఎన్నికల్లో 565 గ్రామ పంచాయతీల్లో 126 పంచాయతీ స్థానాలు బీసీలకు రిజర్వేషన్ ఖరారు కాగా.. ప్రస్తుతం 594 గ్రామ పంచాయతీ స్థానాల్లో 107 పంచాయతీలను బీసీలకు కేటాయించారు. గత ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో పంచాయతీ స్థానాలు పెరిగినా బీసీలకు రిజర్వేషన్లలో జరిగిన అన్యాయంపై జిల్లాలోని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లలో కోత విధించడంపై జిల్లాలోని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. 42శాతం రిజర్వేషన్లు అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ బీసీలను నిలు వు దోపిడీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. బీఆర్ఎస్ హ యాంలో 565 గ్రామ పంచాయతీ స్థానాల్లో 126 స్థానాలను బీసీలకు కేటాయించారు. అంటే దాదాపుగా 22%పైగా బీసీలకు గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిం ది. అయితే ఈ ఎన్నికల్లో స్థానాలు పెరిగినా బీసీలకు కేటాయించే రిజర్వేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కోత విధించింది.
జిల్లాలో 594 గ్రామ పంచాయతీలుండగా జిల్లాలో వందశాతం ఎస్టీ జనాభా గల 92 పంచాయతీల్లో ఎస్టీలకే రిజర్వేషన్ కేటాయించారు. 92 పంచాయతీల్లో 47 పంచాయతీలు మహిళలకు, మరో 45 పంచాయతీల్లో జనరల్ కేటగిరీకి రిజర్వేషన్ చేశారు. అలాగే, ఎస్టీలకు 27 పంచాయతీల్లో రిజర్వేషన్ కల్పించగా వాటి లో మహిళలకు 7 పంచాయతీల్లో, జనరల్ కేటగిరీకి 20 పంచాయతీల్లో రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా జిల్లాలో ఎస్సీలకు 111 పంచాయతీల్లో రిజర్వేషన్ కేటాయించారు, వాటిలో 51 పంచాయతీల్లో మహిళలకు, 60 పంచాయతీలను జనరల్ కేటగిరీకి కేటాయించారు. అలాగే, బీసీలకు 107 పంచాయతీలను కేటాయించగా.. వాటిలో 49 పంచాయతీలు మహిళలకు, మరో 58 పంచాయతీల్లో జనరల్ కేటగిరీకి రిజర్వేషన్ కల్పించారు. 257 పంచాయతీల్లో జనరల్ కేటగిరీకి రిజర్వేషన్ కేటాయించారు, వారిలో మహిళలకు 124 పంచాయతీల్లో, జనరల్ కేటగిరీకి 133 పంచాయతీల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. తక్కువ స్థానాలు కల్పించడంలో బీసీలు మండిపడు తున్నారు.