రంగారెడ్డి/వికారాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): తమకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన రాష్ట్ర బంద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విజయవంతమైంది. ఉదయం 7 గంట ల నుంచే బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొ న్నారు. కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు, కులసంఘాల నాయకులూ బంద్‌కు మద్దతు తెలిపారు. అలాగే, ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది.
వ్యాపారులు వాణిజ్య సంస్థలను స్వచ్ఛందం గా మూసేసి తమ మద్దతు తెలిపారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా.. ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాలలు, కళాశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించారు.ఈ బంద్‌లో బీఆర్ఎస్ నాయకులు పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో, ఆమనగల్లు, కడ్తాల్‌లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్.. షాద్‌నగర్‌లో మాజీ ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్.. చేవెళ్ల ఎమ్మె ల్యే కాలె యాదయ్య, షాద్‌నగర్ ఎమ్మె ల్యే శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు బంద్‌లో పాల్గొన్నారు.
సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాద య్య ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణు లు ఇబ్రహీంపట్నం బంద్‌లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుం డా మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి నేతృత్వంలో పోలీసులు ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
అలాగే.. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు తాం డూరు, పరిగి నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీతోపాటు బీసీ సంఘాల నేతలు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు బంద్ సందర్భంగా రాస్తారోకో, బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో బీసీ సంఘాలు, అన్ని పార్టీల ఆధ్వర్యంలో రోడ్లపై బైఠాయించి ధర్నా చేశారు. డిపోల ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేవు. ఉదయం నుంచే వికారాబాద్, తాండూరు, పరిగి డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి.
బస్సుల్లేక ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో వికారాబాద్ నుంచి తాండూరు, హైదరాబాద్‌కు వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. తాండూరు నియోజకవర్గ కేంద్రం లో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ తదితరులు బంద్‌లో పాల్గొనగా.. మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు చెందిన మండలాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గ కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో పరిగి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అయితే బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పూర్తిగా విఫలమైంది. గవర్నర్‌కు పంపించిన జీవో త్వరగా ఆమోదం పొందేలా సర్కార్ చర్యలు తీసుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. బీసీలను వంచించేలా ప్రభుత్వం మళ్లీ వ్యవహరిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తాం.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు