వికారాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి నిండా ముంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెల్లని జీవో తీసుకొచ్చి ధోకా చేసిందని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్ పెంపు ఆర్డినెన్స్ ఫైల్ గవర్నర్ వద్ద ఉండగానే ఎన్నికలను వాయిదా వేసేందుకే జీవో నంబర్ 9ను తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు.
అం తేకాకుండా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచే ఎన్నికలు ఇప్పుడే జరగవంటూ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి శ్రేణుల్లో ప్రచారం జరిగిందంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంతా డ్రామాలేనని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన రిజర్వేషన్ల ప్రక్రియను కేవలం చెల్లని జీవో తెచ్చి బీసీలపై దొంగ ప్రేమను కాంగ్రెస్ పార్టీ చూపించిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
42 శాతం రిజర్వేషన్‌ను బీసీలకు కల్పిస్తున్నామంటూ జీవో జారీ చేస్తే కోర్టుకెళ్లి ఎన్నికలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క తమిళనాడులో మాత్రమే రాజ్యాంగబద్ధంగా చట్ట సవరణ చేయడంతో రిజర్వేషన్ల పెంపు సాధ్యమైందని.. ఈ విషయం తెలిసినా బీసీలను ధోకా చేయాలనే ఉద్దేశంతోనే జీవోను తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లను పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన రెండేండ్లకు రిజర్వేషన్ల పెంపు చెల్లదని, ఎన్నికలను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసి కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీవో-9 జారీ చేసి, ఎన్నికలకు వెళ్లడమంటే.. బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని దుయ్యబట్టారు.
22 నెలలుగా స్థానిక సంస్థలకు నయాపైసా ఇవ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదట్నుంచి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలంటే భయం పట్టుకున్నదని.. అందుకే కుట్ర పూరితంగా వాయి దా పడేలా చేశారనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతా ల్లో యూరియా కొర త, పింఛన్ల పెంపు, అర్హులకు దక్కని ఇందిరమ్మ ఇండ్లు, పూర్తికాని రుణమాఫీ తదితరాలతో అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతోనే ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనతోనే అమలుకాని జీవోను తెచ్చి బీసీలకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎదుగుదలను ఓర్వడం లేదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. రాష్ట్రంలో బీసీల ఎదుగుదలను ఓర్వలేని సీఎం రేవంత్ బీసీలతో రాజకీయ చెలగాటమాడుతున్నాడు. జీవోలతో రిజర్వేషన్లు రావని తెలిసి కూడా కాంగ్రెస్ బీసీలతో కపట నాటకమడుతున్నది. బీసీల ఆత్మ గౌరవం దెబ్బతినేలా కాంగ్రెస్ ప్రభు త్వం వ్యవహరిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగంగానే రిజర్వేషన్ పరంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ప్రభుత్వానికి బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్థానిక ఎన్నికల్లో 42శాతం కేటాయించాలి.
-బొల్లంపల్లి వెంకటేశ్, బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు, యాచారం
కాంగ్రెస్ మొదట్నుంచి మోసం చేస్తున్నది..
కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి బీసీలను మోసం చేస్తూనే ఉన్నది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల నుంచి ఇప్పటికీ బీసీలను వచ్చిస్తున్నది. కాంగ్రెస్ సుదీర్ఘకాలంపాటు కేంద్రంలో అధికారంలో ఉండి.. రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్లను పెంచకుండా అప్పుడు విస్మరించి ఇప్పుడు డ్రామాలాడుతున్నది. గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ ఉండగానే జీవో తీసుకురావడం అంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచడంపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతున్నది. కామారెడ్డి డిక్లరేషన్‌పైనా బీసీలను మోసం చేసింది. ఆ డిక్లరేషన్‌ను అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో, కార్పొరేషన్ చైర్మన్లలో 42 శాతం బీసీలకు కేటాయించాలి.
– జి.నాగేందర్‌గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్
మాటల గారడీ చేసింది..
కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లంటూ బీసీలను నిండా ముం చింది. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పూటకో మాట మాట్లాడుతూ అసాధ్యమని తెలిసినా మాటల గారడీ చేశారు. ఒకసారి కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ హడావుడి చేశారు. మరోసారి పార్టీ పరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని, ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తున్నామని కాలయాపన చేశారు. చివరకు జీవో చెల్లదని తెలిసినా బీసీలను మోసం చేసేందుకు చెల్లని జీవోను తెచ్చిన రేవంత్‌రెడ్డి ఆపై తన అనుచరులతో కోర్టుల్లో కేసులు వేయించారు. హైకోర్టులో స్టే వచ్చేలా రహస్య మంతనాలు చేసి.. డ్రామాలపై డ్రామాలాడి ఎట్టకేలకు తాను అనుకున్నట్లుగానే బీసీలకు రేవంత్ ధోకా చేశాడు. ముఖ్యమంత్రి బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు.
– మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నది
కాంగ్రెస్ బీసీలను మరోసారి దగా చేసింది. ఆ పార్టీ మోసాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉన్నది. జీవో ద్వారా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని ఇప్పటికే పలుసార్లు చెప్పింది. 9వ షెడ్యూల్లో చేర్చితే, రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప రిజర్వేషన్ల పెంపు అమలు కాదనేది తెలిసి కూడా డ్రామాలాడింది. కామారెడ్డి డిక్లరేషన్‌లో 60 అంశాలున్నా ఒక్క దానినీ అమలు చేయకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే ఎట్లా నమ్ముతాం. చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. కేంద్రంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై పోరాటానికి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. కోట్ల మంది బీసీల మనోభావాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమడుతున్నది.
– శుభప్రద్‌పటేల్,రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు