షాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : తెలంగాణలో బోగస్ కుల గణన పేరుతో బీసీలకు(BCs) అన్యాయం చేస్తే బీసీలమంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ యాదవ్(Barka Krishna Yadav) అన్నారు. బుధవారం షాబాద్ మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ కుల గణన పేరుతో బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేపట్టిన కులగణలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేపట్టిన సర్వేలో బీసీల సంఖ్య ఎలా తక్కువ అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పుడు ఎక్కువగా ఎలా ఉన్నారని, ఇప్పుడు తక్కువగా ఎలా ఉన్నారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఓసీల సంఖ్య ఎక్కువగా ఉందని చూపించడం ప్రభుత్వానికి తగదన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేదాకా బీసీలమంతా ఏకతాటిపై వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పార్టీలను పక్కనపెట్టి బీసీలంతా తమ హక్కులు, రిజర్వేషన్లు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తమకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలమంతా తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన నాయకులు శ్రీనివాస్ గౌడ్, నర్సింలు, ఆనంద్, శ్రీకాంత్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.