సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించే దిశగా టీఎస్ నాబ్ తీసుకుంటున్న చర్యలతో మాదక ద్రవ్యాల విక్రయాల మూలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీఎస్-నాబ్) డైరెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో గురువారం విలేకరుల సమావేశంలో సీవీ ఆనంద్ పలు వివరాలను వెల్లడించారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో, సరఫరాదారులతో సంబంధమున్న వారితో సినీ ప్రముఖులు, రాజకీయ నేతల కుమారులు ఉన్నారని చెప్పారు. రేవ్ పార్టీలు, నగరంలో కొన్ని పబ్బుల్లో డ్రగ్స్ సంబంధాల వ్యవహరాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ సమాశంలో టీఎస్ నాబ్ ఎస్పీ సునీతారెడ్డి, ఏసీపీ నర్సింగ్‌రావు, ఇన్స్పెక్టర్లు రాజేశ్, డానియల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ఇంకా ఏం చెప్పారంటే…
10 రోజుల క్రితం మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహించిన డ్రగ్ పార్టీపై గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి దాడి చేశాం. సినీ ఫైనాన్సియర్ వెంకటరత్నాకర్రెడ్డి అలియాస్ వెంకట్‌ను అరెస్ట్ చేశాం. అతనికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న భాస్కర్ బాలజీని, రైల్వేలో పనిచేసే మురళి అనే వినియోగదారుడిని అదుపులోకి తీసుకున్నాం. డ్రగ్స్ కొని తెచ్చి అమ్మేలా భాస్కర్ బాలాజీకి… వెంకట్ ఫైనాన్స్ అందిస్తున్నాడు. బెంగళూరు నుంచి నైజీరియన్ల ద్వారా డ్రగ్‌ను కొని పార్టీల్లో అమ్ముతున్నట్టు.. బయట కూడా విక్రయాలు చేస్తున్నట్టు తేలింది. బెంగళూర్‌లో నివాసముంటున్న నైజీరియాకు చెందిన అమోబి చుకువుడి మునాగోలు, ఇగ్బేర్ మైఖెల్, థామస్ అనాగ కాలులతో పాటు డ్రగ్ వినియోగదారులైన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విఠల్‌రావు కుమారుడు దేవరకొండ సురేశ్, కొల్లి రామ్‌చంద్, కురపాటి సందీప్, సినీ డైరెక్టర్ అనుగు సుశాంత్‌రెడ్డి, పోకర్ గేమ్ నిర్వాహకుడు పగళ్ల శ్రీకార్ కృష్ణ ప్రణీత్‌లను అరెస్ట్ చేశాం. మరో కీలక సూత్రధారి రాంకిశోర్ వైకుంఠం పరారీలో ఉన్నాడు. ఫైనాన్సియర్ వెంకట్ బ్యాంకు ఖాతాలో ఉన్న 5.5 కోట్లను సీజ్ చేశాం. డ్రగ్ విక్రేతలకు సంబంధించిన ఆస్తులను చట్ట ప్రకారం జప్తు చేస్తాం.
మాదాపూర్ డ్రగ్స్ పార్టీతో అరస్టైయిన ముగ్గురికి సినిమా ఫీల్డ్‌తో సంబంధాలున్నాయి. బాలాజీకి పలువురు డ్రగ్స్ వినియోగదారులున్నారు. వారి ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి. డ్రగ్స్ వినియోగదారులైన సినీ హీరో నవదీప్, నిర్మాత ఉప్పల పాటి రవి(షాడో సినీ నిర్మాత), గచ్చిబౌలి స్మార్ట్ పబ్ నిర్వాహకుడు సూర్య, జూబ్లీహిల్స్ టెర్ర కేఫ్ నిర్వాహకుడు అర్జున్, వ్యాపారి కలహర్‌రెడ్డి, శ్వేత, కార్తీక్ తదితరులు పరారీలో ఉన్నారు.
డ్రగ్ సంస్కృతి నుంచి యువతను దూరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 14 కోట్ల మంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఓ అంచనా. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత రాష్ట్రం, దేశానికి తయారు చేసేందుకు కలిసి రావాలి. అయితే ఇటీవల బేబీ అనే సినిమాలో డ్రగ్స్ వాడే దృశ్యాలు పెట్టారు. డ్రగ్స్‌ను తీసుకోవడం తప్పేమీ కాదన్నట్టుగా ఆ సీన్లలో చూపెట్టారు. మన యువతను మనం కాపాడుకోవాలి. ఈ సమయంలో అటువంటి సీన్లు తగవు. యువతను డ్రగ్స్ వైపు రెచ్చగొట్టే విధంగా సీన్లు ఉంచిన బేబీ సినిమా యూనిట్‌కు ఐడ్వెజరీ నోటీసులు ఇస్తున్నాం. మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో టీఎస్ నాబ్ పోలీసులు దాడి చేసిన సమయంలో కన్పించిన దృశ్యాలు, బేబీ సినిమాలో కన్పించిన దృశ్యాలు ఒకేలా ఉన్నాయి. బేబీ సినిమాలో డ్రగ్స్ సన్నివేశాన్ని వారు అనుకరించినట్టున్నారు. దయచేసి నిర్మాతలు బాధ్యతగా వ్యవహరించాలి.
బెంగళూర్ కేంద్రంగా నైజీరియన్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 33 మంది నైజీరియన్లను అరెస్ట్ చేస్తే అందులో15 మందిని బెంగళూర్ నుంచే అరెస్ట్ చేశాం. తెలంగాణలోకి ఒక్క గ్రామ్ డ్రగ్ కూడా రాకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీఎస్-నాబ్) రాష్ట్ర స్థాయిలో సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా డ్రగ్స్ అమ్మకం, కొనుగోలుదారులు, వినియోగదారులకు నిఘా పెట్టడంతో తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ లింక్‌లు, రేవ్ పార్టీలు, ఈవెంట్లు, పబ్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అరెస్టయిన 8 మంది నుంచి 8 గ్రాముల కొకైన్, 50 గ్రాముల ఎండీఎంఏ, 24 ఎక్సటసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నాం.