రంగారెడ్డి, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : కొహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన నేపథ్యం లో పలువురు రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నాగోల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసే స్థలం తమదని.. ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం బలవంతంగా తీసుకుని తమను రోడ్డుపాలు చేయడం తగదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొహెడ సర్వేనంబర్ 167/1లో ప్రభుత్వం పండ్ల మా ర్కెట్ నిర్మాణానికి కేటాయించిన భూముల్లో సుమారు 115 మంది రైతులు వారి తాతల కాలం నుంచే సాగు చేసుకుని జీవిస్తున్నారు.
పరిహారం ఇచ్చిన తర్వాతే మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, రైతులను అక్రమంగా అరెస్టు చేసి నాగోల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆ ఠాణాకెళ్లి రైతులను పరామర్శించి మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఎలాంటి వివాదాల్లేని భూమిని.. రేవంత్ ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించి.. వివాదంలో ఉన్న భూమిని పండ్ల మార్కెట్‌కు కేటాయించడంతోపాటు.. రైతులకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే ఆ స్థలంలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం దారుణమని మండిపడ్డారు. రైతుల అక్రమ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొహెడలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వెంటనే రైతులకు తగిన పరిహారం చెల్లించాలని.. లేకుండా మార్కెట్ పనులను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
పోలీసుల అదుపులో కాంగ్రెస్ నేతలు
కొహెడ పండ్ల మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వాలని కొహెడకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి పర్యటనను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టుచేశారు.