Vikarabad | వికారాబాద్, మార్చి 25 : చేమ దుంప, మొరంగడ్డలపై ఎస్సీ మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని వికారాబాద్ నియోజకవర్గ ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ అధికారి వైజయంతి కళ్యాణ్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని మదన్‌పల్లి గ్రామంలో శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కూరగాయల పరిశోధన స్థానం, రాష్ట్ర ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు, దుంప విత్తన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైజయంతి కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో చేమగడ్డ (కాలోకేసియా) , మొరంగడ్డ (స్వీట్ పొటాటో) చాలా ముఖ్యమైనదని అన్నారు. తెలంగాణలో కేవలం రంగారెడ్డి జిల్లాలో మాత్రమే చేమగడ్డ సాగు చేయబడుతుందని చెప్పుకొచ్చారు. వికారాబాద్ పట్టణం పరిసర ప్రాంతంలోని అత్వెల్లీ, కొంపల్లి, మదనపల్లి, ఎర్రవల్లి , ఫులమద్ది గ్రామాల్లోని భూములు వాతావరణం ఈ దుంప పంటలకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. హైదరాబాద్‌కి సమీపాన ఉండడం వలన కూరగాయల సాగు చేపట్టవచ్చు అని చెప్పారు. శివరాత్రి, రంజాన్ పండుగ సమయాల్లో మొరంగడ్డ (స్వీట్ పొటాటో)కు మంచి డిమాండ్ ఉంటుందని చెప్పారు. లాభదాయక పంటలు వేయడానికి రైతులు ముందుకు రావాలని ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను, పథకాలను అందిపుచ్చుకోవాలి అని రైతులను కోరారు.
శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కూరగాయల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ మాట్లాడుతూ.. చేమగడ్డ, మొరంగడ్డ సాగు వాటి యాజమాన్య పద్ధతుల గురుంచి వివరించారు. ఇవి పిండి పదార్థములను, ఖనిజాలను కలిగి, విటమిన్ ఎ, బిలను కలిగి ఉంటుందని తెలిపారు. మానవ పోషణలో ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చెప్పారు. తక్కువ కాల పరిమితిలో ఎక్కువ ఉత్పత్తిని ఇచ్చే ఈ కూరలను కూరగాను, పచ్చికూరగాను, ఆకులను పశువుల దాణా గాను, ఆల్కహాల్ తయారీ లోనూ ఉపయోగిస్తారని తెలిపారు. దుంప రైతులకు సాగులో సలహాలు, సూచనలు అందజేశారు. ఇవి ఉష్ణ మండల పంటలు, ఈ పంటకు ఎప్పుడూ తేమ భూమిలో అధికంగా ఉండాలని వివరించారు. నేలలు, వాటి తయారీని వివరించారు. తెలంగాణలో చేమగడ్డ ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు నాటడానికి అనుకూలమని తెలిపారు. మంచి పద్దతులతో తోటను నాటినచో మంచి దిగుబడిని పొందవచ్చన్నారు. మార్కెట్ లో వీటికి ఏ ఇబ్బంది లేని మార్కెట్ సదుపాయాలు కలవని సూచించారు.
శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ మాట్లాడుతూ.. చేమదుంపలోని శతముఖి, భావపురి వంటి రకాలు, వాటి దిగుబడిని వివరించారు. అలాగే మొరంగడ్డలోని సామ్రాట్, కిరణ్ రకాలు, వాటి దిగుబడిని తెలిపారు. చేమదుంప పంట దుంపలతో, మొరంగడ్డ పంట తీగలతో నాటబడుతుందన్నారు. ఈ పంటల్లో చేపట్టాల్సిన అంతరకృషి చర్యలు, వేసుకోదగిన అంతర్ పంటలు, కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ పంటల్లో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి, వీటితో తయారు చేసుకొనే పదార్థాల గురించి వివరించారు. రైతులు కూడా మాట్లాడుతూ తమ అనుభవాలు మిగితా రైతులతో పంచుకున్నారు. సదస్సు ముగింపులో రైతులకు చేమగడ్డ విత్తనాలను , మొరంగడ్డ కటింగ్స్ పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో రైతులు హన్మంతు, అశోక్, ఉద్యాన అధికారులు, కూరగాయ పరిశోధన స్ధానం, రాజేంద్రనగర్ వారు ప్రశాంత్ , కుమార్ ఇతర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.