సిటీబ్యూరో : మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న రూ.లక్షన్నర కోట్ల అవినీతిని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ‘మూసీ పోరుబాట’ చేపట్టింది. ఈమేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు నేతృత్వంలో 50 బృందాలు మూసీ పరీవాహక ప్రాంతా ల్లో పర్యటించి సుందరీకరణ పేరిట కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న లూటీని వివరించాయి. ఈమేరకు మూసీ పోరుబాట కార్యక్రమాన్ని తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించా రు. ఈ కార్యక్రమం ఈనెల 14 దాకా కొనసాగుతుందని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చి భూములను చెరబట్టి రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టేందుకు ఏ విధంగా కుట్రలు చేస్తున్నదో పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజలకు వివరిస్తున్నామన్నారు. బీఆర్ఎస్వీ బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పిస్తాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి భూములను లాక్కోవడం ఆపేసేదాకా పోరాటం కొనసాగుతుందన్నారు.
ఇంటింటికీ తిరిగి బాధితుల్లో అవగాహన
మూసీ పరీవాహక ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మార్కింగ్‌లు, కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో బీఆర్ఎస్వీ 50 బృందాల ప్రతినిధులు పర్యటించారు. బాపుఘాట్, హైదర్షాకోట్, గంధంగూడతో పాటు అంబర్‌పేట, నాగోల్, కేటీఆర్ నగర్, చాదర్‌ఘాట్, ఎంజీ బస్టాండ్, చాంద్రాయణగుట్ట, తిలక్‌నగర్, లంగర్‌హౌస్, గోల్నాక ప్రాంతంలో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట చేస్తున్న విధ్వంసాన్ని వివరించారు. సుందరీకరణ పేరిట పేద ప్రజల ఇండ్లు, భూములను ఏవిధంగా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారో కర పత్రాల రూపంలో బాధితులకు అందజేశారు. కాంగ్రెస్ అక్రమాలను ముద్రించిన వాల్ పోస్టర్లను ఇంటంటీకి అతికించారు.
బీఆర్ఎస్వీ బృందాల ప్రతినిధులతో మూసీ పరీవాహక బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇండ్లను కోల్పోయి రోడ్డున పడ్డామని చాదర్‌ఘాట్ తదితర బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని బాధితులు బీఆర్ఎస్వీ విద్యార్థులతో మమేకమై కాలనీల్లో తిరిగారు. బాధితులకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని వివరించారు. వారి సమస్యలను తెలుసుకుని అండగా ఉంటామని హామీ ఇస్తూ ముందుకు సాగారు.