రంగారెడ్డి, జూలై 18 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు రంగారెడ్డి కలెక్టర్ శశాంక తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక వ్యవసాయ, సహకార, బ్యాంకర్లతో రైతు రుణమాఫీ పథకం అమలులో తీసుకోవలసిన చర్యలపై డీసీసీ-డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు 2018, డిసెంబర్ 12 లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 2023 డిసెంబర్ 9 నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
మొదటి విడత రూ.లక్ష వరకు, రెండో విడత రూ.1.50లక్ష వరకు, మూడో విడత రూ.2లక్షల వరకు దశలవారీగా రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో 49,741 మంది రైతులకు లక్షలోపు రుణమాఫీ ద్వారా రూ.278.06 కోట్లు చెల్లించడం జరుగుతుందన్నారు.
జిల్లాలోని బ్యాంకులు, సహకార శాఖ బ్యాంకులు, సహకార శాఖ సొసైటీల ద్వారా రైతులకు నేరుగా వారివారి ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమవుతుందని, ప్రతి బ్యాంకుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో, మండల స్పెషల్ ఆఫీసర్లను, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లను సంప్రదించేలా చర్యలు చేపట్టాలని అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు.
రుణమాఫీ కోసం వచ్చే రైతులకు పూర్తిగా సహకరిస్తూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లు, రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఖరీఫ్, రబీకి సకాలంలో పంట రుణాలను అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కుసుమ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 46,633 మంది రైతులకు రూ.256.26 కోట్ల రుణ మాఫీ

వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం చేపట్టిన రైతు రుణ మాఫీ ద్వారా జమయ్యే రుణం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా నేరుగా రైతులకు చేరేలా బ్యాంకర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా వేల కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 46,633 మంది రైతులకుగాను 256.26 కోట్ల రూపాయలు రైతులకు రుణ మాఫీ లభించనున్నదని పేర్కొన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి రైతు వేదికలో రైతుల లిస్టు డిస్ప్లే చేయాలన్నారు. రైతులకు సంబంధించిన 1బీ, ఆధార్ కార్డు, భూమికి సంబంధించిన్ పాస్ పుస్తకం తదితర డాక్యుమెంట్స్ తీసుకొని రెన్యువల్ కోసం బ్యాంకుకు రావాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రతి గ్రామపంచాయతీలో కూడా రైతులకు సంబంధించి వివరాలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు. 30 రోజులపాటు వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉండి రైతు రుణమాఫీ రైతులకు చేరేలా చూడాలన్నారు. లిస్టులో రైతుల పేర్లు లేకపోతే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రుణమాఫీ సహాయ కేంద్రం టోల్ ఫ్రీ నం. 9989291049, 9000470989లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఎల్డీఎం యాదగిరి, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రాజు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , తెలంగాణ గ్రామీణ బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు, ఇతర బ్యాంకుల అధికారులున్నారు.