షాద్నగర్, డిసెంబర్ 24 : కేశంపేట మండలం సంగెం గ్రామ రెవెన్యూ పరిధిలోని లింగన్న పలుగుట్ట ప్రాంతంలో సర్వేనంబర్ 220లోని ఎకరం 31 గుంటల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. ఆ రైతుల నుంచి కొందరు వ్యాపారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై మట్టి వ్యాపారానికి తెరలేపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని లీజ్ పేరుతో తీసుకుని మట్టిని తరలించేందుకు ఐదేండ్లకు రూ. 1,77,500 ఒప్పందం కుదుర్చుకుని.. ఏప్రిల్ 18న రూ.1,50,000 చెల్లించారని, అనంతరం ఎలాంటి అనుమతుల్లేకుండా రాత్రివేళల్లో మట్టిని ఇష్టానుసారంగా తవ్వుతూ టిప్పర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
మట్టి అక్రమ తరలింపు గత కొన్ని రోజులుగా జరుగుతున్నా రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక్కడ మట్టి వ్యాపారం జరుగడం లేదని.. అసైన్డ్ పొందిన రైతులే భూమిని చదును చేసుకుంటున్నారని వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని, గుట్టపైకి ప్రత్యేక రోడ్డును ఏర్పాటు చేసి మట్టిని తరలిస్తున్నా అధికారులకు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మట్టి వ్యాపారు లతో అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై విలువైన సహజ సంపదను కొల్లగొడుతున్నారని వాపోతున్నారు. ఈ విషయమై కేశంపేట తహసీల్దార్ అజాంఅలీఖాన్ను వివరణ కోరగా.. ఘటనాస్థలానికి అధికారులను పంపించి మట్టి వ్యాపారాన్ని గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.