సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సమాచార హక్కు చట్టం కింద మూడు దరఖాస్తులను అందజేయగా హైడ్రా అధికారులు తిరస్కరించారని అడ్వకేట్ లుబ్రా సర్వత్ సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం వర్తించదంటున్న హైడ్రాపై చర్యలు తీసుకుని జరిమానా విధించాలని ఆయన కోరారు. హైడ్రాను సమాచార హక్కు చట్టం-2005కు అతీతంగా ఏర్పాటు చేశారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలో ఆర్టీఐని అమలు చేయకపోవడం సరికాదన్నారు.
దీన్ని తీవ్రమైన ఉల్లంఘనగా భావించి కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంఏయూడీ విడుదల చేసిన జీవో ప్రకారం హైడ్రాకు ఇప్పటి వరకు రూ.100 కోట్ల ప్రజాధనం కేటాయించారని, కానీ, హైడ్రా సిబ్బంది వివరాలు, కార్యకలాపాల వివరాలను సూచించే అధికారిక వెబ్సైట్ లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అదేవిధం గా హైడ్రా కార్యాలయంలో ఇప్పటి వరకు పీఐవో అధికారిని నియమించలేదని తెలిపారు.