బొంరాస్పేట, ఫిబ్రవరి 13 : సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి నిధుల వరద కొనసాగుతున్నది. ఇటీవలే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో బీటీ రోడ్లు, వంతెన నిర్మాణానికి రూ.213 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం… సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లు, కొత్తగా వంతెనల నిర్మాణాలకు మరో 325.90 కోట్లను ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల విస్తరణకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నుంచి లింగన్పల్లి, దుద్యాల వరకు ఉన్న 11.2 కిలో మీటర్ల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.28 కోట్లు, దుద్యాల మండలం కుదురుమల్ల నుంచి దుద్యాల మీదుగా దాదాపూర్ వరకు ఉన్న 17 కిలోమీటర్ల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు రూ.50 కోట్లు, కొడంగల్ మండలం హస్నాబాద్ నుంచి నీటూరు వరకు ఉన్న 10.03 కి.మీ సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చడానికి రూ.26 కోట్లు, కొడంగల్ మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పాత కొడంగల్ వరకు 4 కి.మీ సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.11 కోట్లు, బొంరాస్పేట మండలంలోని తుంకిమెట్ల నుంచి కోస్గి డబుల్ రోడ్డును 11 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయడానికి రూ.14 కోట్లు, కొడంగల్ మండలం రావులపల్లి నుంచి దౌల్తాబాద్ వరకు నాలుగు లైన్ల రహదారిగా కోసం రూ.40 కోట్లు మంజూరయ్యాయి. మిగతా రోడ్లు నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూరు మండలాల్లో ఉన్నాయి. ఐదు వంతెనల నిర్మాణాలకు రూ.28.50 కోట్లు మంజూరయ్యాయి. జాతీయ రహదారి నుంచి బొంరాస్పేట మధ్యలో పెద్ద చెరువు అలుగు వద్ద నూతన వంతెన నిర్మాణానికి రూ.5 కోట్లు, రావులపల్లి-మద్దూరు రోడ్డు మధ్యలో వంతెన నిర్మాణానికి రూ.4.25 కోట్లు, కోస్గి-దౌల్తాబాద్ రోడ్డులో వంతెన కోసం రూ.4.25 కోట్లు, నాందారం-బాపల్లితండా రోడ్డులో వంతెన నిర్మాణం కోసం రూ.5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.