ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములు లాక్కునే ప్రయత్నం చేసిన అధికారులపై తిరగబడిన లగచర్ల గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి జిల్లా నిరసనలతో హోరెత్తింది. ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను అందజేసి, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నినదించారు. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’.. ‘చూపిస్తాం.. చూపిస్తాం రైతుల తడాఖా చూపిస్తాం..’ ‘కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుదాం..’.. ‘ప్రజాపాలనంటరు.. ప్రజలనే పీడిస్తరు..’.. అన్న నినదాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిన్నంటాయి.
ఈ సందర్భంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ లగచర్ల రైతుల జీవితాలతో చెలగాటమాడడం వల్ల వారి బతుకులు మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆర్తనాదాలు కాంగ్రెస్ ప్రభుత్వ చెవికి వినిపించడం లేదా.. అని ప్రశ్నించారు. నిత్యం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న రైతుల జీవితాలను బుగ్గిపాలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమా అంటూ మండిపడ్డారు. అనారోగ్యంగా ఉన్న రైతుకు బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్లిన తీరును చూస్తే గుండెలు మండిపోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్య కాండను ఇక సహించేది లేదని హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ)