వికారాబాద్, జూలై 29 : బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యను జైలుకు పంపడం అప్రజాస్వామ్యమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో జంగయ్యను శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ..కొంతకాలంగా కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని కొన్ని చానళ్లు లక్ష్యంగా చేసుకుని జుగుప్సాకరమైన శీర్షికలు పెడు తూ, వార్తలు ప్రసారం చేయడంతో.. మహా టీవీ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లి న జంగయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి 22 రోజులపాటు చంచల్‌గూడ జైలులో ఉంచడం దారుణమని మండిపడ్డారు.
జుగుప్సాకరమైన శీర్షికలు పెడుతూ ఇతరుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు ప్రసారం చేసిన మహా టీవీపై లేని చర్యలు.. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపేందు కు వెళ్లిన వారిపై ఉండడం సిగ్గు చేటన్నారు. ఇటువంటి పక్షపాత ధోరణిని ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని సూచించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు అశోక్, సుభాన్‌రెడ్డి, శివకుమార్, సురేశ్, అనిల్, గిరీశ్, షఫీ తదితరులు ఉన్నారు.