రంగారెడ్డి, జూన్ 14(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపడుతున్న పలు నిర్మాణ పనులు ఇంకా నత్తనడకనే కొనసాగుతున్నాయి. స్కూళ్లు తెరిచే నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉండగా.. కాలేదు. పనులు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు.
కొన్ని స్కూళ్లలో పనుల మధ్యే తరగతులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కనీస వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, కరెంట్ వంటి సౌకర్యాలు కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో తొలి విడుతలో 423 పాఠశాలల్లో పనులను ప్రారంభించగా.. ఇప్పటివరకు 103 పాఠశాలల్లోనే పనులు పూర్తయ్యాయి. బడిబాట కార్యక్రమం పూర్తయ్యేనాటికి పనులు పూర్తి అయిన వాటిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మన ఊరు-మన బడి, పీఎం శ్రీ పథకాల కింద ఎంపిక కాకుండా మిగిలిపోయిన ప్రభుత్వ పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో మొత్తం 1,309 పాఠశాలలను ఎంపిక చేశారు. పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులను గత విద్యాసంవత్సరం చివరలోనే అధికారులు గుర్తించారు. ప్రధానంగా పాఠశాలల్లో ఐదు రకాల సమస్యలు నెలకొన్నట్లు గుర్తించి ఆయా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు.
భవనాలకు మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సమస్యలతోపాటు బాలికలకు మరుగుదొడ్లు లేని చోట నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేశారు. ఈ క్రమంలో తొలి విడుతలో 423 పాఠశాలల్లో పనులను మొదలు పెట్టారు. వివిధ కారణాలతో ఆలస్యంగా పనులను ప్రారంభించడంతో పాఠశాలలు తెరిచే నాటికి పనులు పూర్తి కాలేదు. ఇప్పటివరకు కేవలం 103 పాఠశాలల్లోనే పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 286 పాఠశాలల్లో పనులను చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు వారు చెబుతున్నారు.
అమ్మ ఆదర్శ కమిటీలతో చేపడుతున్న ఈ పనులకు డీఎంఎఫ్టీ, ఉపాధిహామీ నిధులను వెచ్చిస్తున్నారు. నాణ్యతను పరిశీలించడంతోపాటు చేసిన పనులను రికార్డు చేసి చెల్లింపులకు సిఫారసు చేసే బాధ్యతలను పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఈడబ్ల్యూఐడీ ఇంజినీరింగ్ ఏఈలకు అప్పగించారు. విద్యాశాఖ అధికారితోపాటు ప్రధానోపాధ్యాయులు, ఎంపీడీవో, ఎంపీవోలతోపాటు జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో పాఠశాలలు తెరిచేనాటికి నూతన శోభను సంతరించుకోలేకపోయాయి. పనులు పూర్తయిన చోట ఇంకా రంగులు వేయలేదు. బడి బాట కార్యక్రమం ముగిసేనాటికి అన్ని పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల్లో పనులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక విడుతల వారీగా..పనులను చేపడుతుండడంతో ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చేసరికి ఇంకెంత కాలం పడుతుందో! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు యాభై శాతం పనులు పూర్తయ్యాయి. జూలై నాటికి ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో పనులను పూర్తి అయ్యేలా చూస్తాం.