బండ్లగూడ, అక్టోబర్ 3 : తాము ఉన్న ఇండ్లను వదిలి వెళ్లే ప్రశక్తే లేదని తేగిసి చెబుతున్నా అధికారులు మాత్రం తమదైన స్థాయిలో బాధితులకు నచ్చజెప్పి ఇండ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇటీవల కాలంలో నగరంలో హైడ్రా పేరుతో చెరువులు, కుంటలతో పాటు మూసీ రివర్బెడ్ ప్రాంతాల్లో కబ్జాలు చేసి ఇండ్లను నిర్మించుకుని ఉన్న ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలు చేపడుతున్నారు.
రాజేంద్రనగర్, గండిపేట మండలం పరిధిలోని జియాగూడ, కార్వాన్, లంగర్‌హౌస్, అత్తాపూర్, కిస్మత్పూర్, మంచిరేవుల, నార్సింగి, రాందేవ్‌గూడ, హైదర్షాకోట్, గంధంగూడ, గండిపేట, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో మొత్తం మూసీ రివర్బెడ్ ప్రాంతాల్లో 332 ఇండ్లను అధికారులు గుర్తించారు. కాగా వాటిని కూల్చేందుకు వెళ్లగా తము నివాసం ఉంటున్న ఇండ్లను వదిలి పోలేమని అధికారులపై తిరుగబడుతున్నారు. దీంతో వారికి నచ్చజెప్పే బాటలోకి అధికారులు దిగారు.
ఇందుకు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికి ప్రాంతాలను కేటాయించారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 22 మంది బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. చేసేదేమీ లేక ప్రజలు ఇచ్చిన పట్టాలను చేత పట్టుకుని ఇండ్లకు వెళ్తున్నారు.