యాలాల, సెప్టెంబర్ 27 : దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ నెలకొల్పేందుకు 30 ఎకరాలను కేటాయించడం సరికాదని, దీనివల్ల 12 లక్షల చెట్లు కనుమరుగయ్యే ప్రమాదమున్నదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆకుపచ్చ తెలంగాణ కోసం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి విస్తృతంగా మొక్కలను నాటగా, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెట్లను నరికివేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కండ్లు మూసుకొని అటవీ భూమిని నేవీకి అప్పగిస్తున్నారని, దామగుండం ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అటవీ ప్రాంత భూములను కేటాయించడానికి బదులుగా సీఎం రేవంత్‌రెడ్డి, వారి సోదరులకు చెందిన 5000 ఎకరాల్లో నుంచి కొంత భూమిని కేటాయిస్తే ప్రజలకు ఇబ్బందులు కలుగవని హితవు పలికారు.
దామగుండం వృక్ష సంహారాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మూసీ నది పరీవాహక భూ నిర్వాసితుల పక్షాన బీఆర్ఎస్ నిలుస్తున్నదన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నదని, ఈ రోడ్డుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుపాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీశైల్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజూగౌడ్, తాండూరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ నరేందర్ గౌడ్, జనరల్ సెక్రటరీ సలీం, తాండూరు మండల అధ్యక్షుడు వీరేందర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్‌చారి తదితరులు పాల్గొన్నారు.