వికారాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత కులగణన సర్వే రిపోర్ట్‌తో బయటపడింది. రిపోర్ట్‌లో బీసీ జనాభాను పరిశీలించినట్లయితే బీసీలకు అన్యాయం చేసేందుకు సర్కారు పెద్ద కుట్ర చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిపోర్ట్‌లో బీసీ జనాభాను తక్కువగా చూపుతూ ప్రభుత్వం చేసిన కుట్రపై బీసీ సంఘాల నుంచి పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ సర్కారు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51 శాతం ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే రిపోర్ట్‌లో మాత్రం 46.25 శాతానికి తగ్గడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ప్రతి పదేళ్లకు సగటున 13 శాతం నుంచి 15 శాతం మేర జనాభా పెరుగుతుంది. కానీ విచిత్రమేమిటంటే సర్కారు విడుదల చేసిన కులగణన రిపోర్ట్‌లో మాత్రం బీసీ జనాభా తగ్గడంపై బీసీలను అణచివేసేందుకు చేసిన కుట్ర అంటూ బీసీ సంఘాల నాయకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ఈ కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవద్దని, ఒకవేళ ఈ తప్పుడు లెక్కలను పరిగణనలోకి తీసుకొని బీసీలను రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అన్యాయం చేసేందుకు చేస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన కులగణన వివరాల్లో బీసీల జనాభా తక్కువ చూపించడం అన్యాయం. జనాభాలో బీసీలు 53 శాతానికి పైగా ఉండగా.. కేవలం 46 శాతంగా పేర్కొనడం సరైంది కాదు. బీసీలకు మోసం చేసేందుకు సర్కారు కుట్ర చేస్తున్నది. వాస్తవానికి సుమారు 5 శాతం మేర కులగణన మిగిలిపోగా సరైన వివరాలు సైతం ప్రభుత్వం ప్రకటించలేకపోయింది.
బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు వివిధ రంగాల్లో రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి కట్టుకథలు చెప్పి మోసగించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే కులగణన చేపట్టామని బీరాలు పలికిన సర్కారు తీరా ప్రకటించిన వివరాల్లో బీసీల జనాభా తక్కువగా చూపించడం సరైనది కాదు. ఆయా కులాలవారీగా ఉన్న జనాభాను సైతం ప్రభుత్వం ప్రకటించిన కులగణనలో చూపించకపోవడం మరోసారి మోసం చేసేందుకు వేస్తున్న కుయుక్తులేనని తేటతెల్లమైంది.
– ముకుంద నాగేశ్వర్, టీజేఏసీ చైర్మన్, వికారాబాద్ జిల్లా
రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలదే ఉన్నది. బీసీలకు దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్థికంగా ప్రభుత్వంలోని పెద్దలు అన్యాయం చేస్తూనే ఉన్నారు. బీసీల జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ నాయకులు దురుద్దేశంతోనే రాష్ట్రంలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇది ముమ్మాటికి బీసీలను అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని అగ్రకులాల నాయకుల కుట్రగానే స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే బీసీ సంక్షేమ సంఘం ఊరుకోదు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలవారిని ఏకతాటిపైకి తీసుకువచ్చి బీసీలకు న్యాయం జరిగే వరకు తెలంగాణ ఉద్యమం మాదిరిగా బీసీల ఉద్యమం లేవనెత్తి కాంగ్రెస్ సర్కార్‌కు గుణపాఠం చెబుతాం.
– రాజ్‌కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుడు
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని, ఓసీల జనాభా ఎక్కువుందని, బీసీల జనాభా తక్కువుందని చూపించేందుకు సర్వే రిపోర్ట్‌ను కాంగ్రెస్ సర్కారు బయటపెట్టింది. బీసీల జనాభాను సమగ్ర కుటుంబ సర్వేలో 51 శాతం చూపించగా, కులగణన సర్వే రిపోర్ట్‌లో మాత్రం 46 శాతం బీసీ జనాభా ఉన్నట్లు తగ్గించి లెక్కలు చూపించారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల జనాభా 13 శాతం ఉండగా, కులగణన సర్వే రిపోర్ట్‌లో 15 శాతానికి పెరిగింది. వారికి కావాల్సిన జనాభా లెక్కలను పెంచుతూ బీసీ జనాభాను తగ్గించారు. సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే బీసీ జనాభాను 21 లక్షల మేర తగ్గించి లెక్కలు ప్రభుత్వం చూపించింది.
ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన సర్వేను బీసీ సంఘాలన్నీ మొదట్నుంచి వ్యతిరేకించాయి, కుట్ర కోణంలో భాగంగానే సర్వే చేశారు.ప్రతీ కుల సంఘానికి గ్రామాలవారీగా సంఘాలున్నాయి, ఏ ఊర్లో ఎన్ని గడపలున్నాయనేది పక్కా లెక్కలున్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు రూ.20 వేల కోట్లను కేటాయిస్తామని, రెండు బడ్జెట్లు పూర్తైనా ఇప్పటికీ కేవలం రూ.5 వేల కోట్లను మాత్రమే బడ్జెట్లో బీసీలకు కేటాయించారు. మరోవైపు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు ఉంటే, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 3.68 కోట్ల జనాభా ఉండగా, కులగణన సర్వేలో 3.70 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కలు చూపించారు. ఏ లెక్కలు చూసినా జనాభా పెరుగుదల 10 శాతానికిపైగా ఉంటుంది, తెలంగాణ జనాభా 4 కోట్లకుపైనే ఉంటుంది.
– బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఎన్.శుభప్రద్‌పటేల్
రాష్ట్రంలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపేందుకు, అగ్రకులాలను మరిన్ని అందలాలు ఎక్కించేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ కుట్ర అమలు చేస్తున్నది. రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో బీసీల జనాభాను ఉద్దేశపూర్వకంగా 46 శాతం మాత్రమే ఉన్నట్లు నివేదికలు బహిర్గతం చేయడం బీసీలను అణచివేసే చర్యల్లో భాగమే. ఇలాంటి చర్యలను బీసీ నాయకులు అందరూ ఏకమై ముక్త కంఠంతో ఖండించాలి. ఏడాదిన్నర క్రితం అస్తవ్యస్తంగా చేసిన కుల గణననే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయడం చూస్తుంటే బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా మరింత అణగదొక్కేందుకు వేసిన ఎత్తుగడగానే ఉన్నది. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ బీసీ ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేయడం తథ్యం
– రాజుగౌడ్, గ్రంథాలయ సంస్థ వికారాబాద్ జిల్లా మాజీ చైర్మన్