సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బెల్లం చుట్టూ ఈగల్లా… అధికారం చుట్టూ కొందరు నేతలు నిలకడ లేకుండా వ్యవహరిస్తారు. ప్రజలెవరూ ఇదేమీ గమనించడంలేదని భ్రమిస్తారు. కానీ… ప్రజా తీర్పులో మాత్రం ఆ మేరకు తేడా కొడుతుందని ఫలితాల్లో తేలిపోతుంది. ఇందులో భాగంగా తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ హైదరాబాద్ మహా నగర పరిధిలో జంపింగ్ జపాంగ్‌లకు ఓటర్లు భారీ ఝలక్ ఇచ్చారు. ప్రధానంగా ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్లు దక్కించుకున్న ముగ్గురు అభ్యర్థులూ ఓటమి పాలయ్యారు.
గత ఏడాది చివరలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరింది. అనంతరం కొన్ని నెలలకే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మారాయి. ఇందులో కొందరు నేతలు ఏండ్ల తరబడి కొనసాగిన పార్టీని, జెండాను వదిలి రాత్రికిరాత్రే పార్టీ ఫిరాయించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్లు సాధించి… ఎంపీలుగా మారాలనుకున్నారు. కానీ వారొకటి తలిస్తే… దైవమొకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. తొలుత మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి సునీతారెడ్డి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బీఆర్ఎస్ను వీడి అధికార కాంగ్రెస్‌లో చేరారు. వాస్తవానికి వీళ్లు చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి టికెట్ ఆశించారు.
కానీ సీఎం రేవంత్‌రెడ్డి పట్టుబట్టి.. తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి లోక్‌సభ నుంచి వీరికి టికెట్ ఇప్పించారు. అనంతరం చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి 2019లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన రంజిత్‌రెడ్డి తిరిగి గులాబీ జెండా మీదనే పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు ప్రకటించారు. పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చి తన అభ్యర్థిత్వాన్ని సైతం ముందుగానే ఖరారు చేయించుకున్నారు. కానీ రాత్రికిరాత్రే అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కండువా కప్పుకుని చేవెళ్ల స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. దీని తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి, గెలిచిన దానం నాగేందర్ సైతం రాత్రికిరాత్రే పార్టీ మారారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఇలా ముగ్గురు నేతలు కూడా గులాబీ చెంతనే ఉండి..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హస్తం గూటికి చేరి లోక్‌సభ స్థానాల్లో పోటీ చేశారు. మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్… మూడు స్థానాల్లో జంపింగ్ జపాంగ్‌లకు ఓటర్లు షాక్ ఇచ్చారు. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన సునీతా మహేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. అక్కడ బీజేపీ తరఫున ఈటల రాజేందర్ విజయాన్ని కైవసం చేసుకున్నారు.
చేవెళ్ల పార్లమెంటు స్థానంలో కూడా రంజిత్‌రెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. ఇక… సికింద్రాబాద్ స్థానంలో కూడా దానం నాగేందర్ ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో మాజీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతిలో దానం ఓటమి చెందారు.